29.2 C
Hyderabad
September 10, 2024 17: 00 PM
Slider చిత్తూరు

“టిడిఆర్ బాండ్ల మాఫియా” భరతం పట్టండి

#naveenkumarreddy

తిరుపతి నగరంలో టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై సిట్ (సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం) లేక విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని లేఖలో బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన బాధితులకు టిడిఆర్ బాండ్లు న్యాయబద్ధంగా త్వరలో ఇచ్చేలా చూడాలని సీఎం రాసిన లేఖలో బిజెపి నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి కోరారు.

తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టిడిఆర్ బాండ్ల ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు,సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు,ఎమ్మార్వో కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు,కొంతమంది కార్పొరేటర్లను విచారణలో భాగంగా “జ్యూడిషియల్ కస్టడీ”లోకి తీసుకోవాలని సీఎం ను కోరడం జరిగిందన్నారు.

జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రంలో జరిగిన భారీ కుంభకోణం తర్వాత తిరుపతి నగరపాలక సంస్థ టిడిఆర్ బాండ్ల కుంభకోణం రెండవ స్థానంలో ఉందన్నారు. నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రోడ్లు అవసరమని తాము కూడా స్థానికులుగా స్వాగతిస్తున్నామని అయితే టిడిఆర్ బాండ్ల ముసుగులో జరిగిన భారీ కుంభకోణం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దోషులను శిక్షించాలని సీఎం కు రాసిన లేఖలో నవీన్ కోరారు.

మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన బాధితులు హైకోర్టుని ఆశ్రయించి “స్టే” తెచ్చుకున్నా కూడా లెక్కచేయకుండా నగరపాలక సంస్థ,ఎమ్మార్వో కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు అప్పటి అధికార పార్టీ నాయకుల అండదండలతో బెదిరించి భయపెట్టి టిడిఆర్ బాండ్లను తమకే తక్కువ ధరకు అమ్మాలని లాక్కోవడం జరిగిందన్నారు. టిడిఆర్ బాండ్లను వైజాగ్ తో పాటు ఇతర నగరాలలోని బిల్డర్లకు అధిక ధరలకు అమ్మేందుకు కొంతమంది అవినీతి అధికారులు కార్పొరేటర్లు బ్రోకర్ల అవతారం ఎత్తి భూములు ఇచ్చిన బాధితుల కడుపు కొట్టారన్నారు.

DBR  రోడ్డులో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్డు భూములకు అప్పటి సబ్ రిజిస్టర్ వాల్యుయేషన్ ను ఇష్టానుసారంగా పెంచుకొని వైజాగ్ లో అమ్ముకున్న విషయం బహిర్గతం కావడంతో అప్పటి కమిషనర్ గిరీష ఐఏఎస్ ఇచ్చిన సమాచారంతో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (DTCP) ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలతో విజిలెన్స్ విచారణకు వచ్చిన అధికారులను భయపెట్టి వెనక్కి పంపించి ఆ కేసును నీరుగార్చిన సంఘటన పై సమగ్ర దర్యాప్తు పునః ప్రారంభించాలని నవీన్ సీఎం కు రాసిన లేఖలో కోరారు.

టిటిడి కి సంబంధించిన స్థలాలలో ఫ్రీ లెఫ్ట్ ల పేరుతో ఎస్ వి హై స్కూల్ పక్కన కోర్టుకు మార్గము, శ్రీదేవి కాంప్లెక్స్ పక్కన ఏర్పరిచిన రోడ్డు (జబ్బర్ లేఔట్), బాలాజీ కాలనీ మ్యూజిక్ కాలేజ్ పక్కన ఫ్రీ లెఫ్ట్ రోడ్డు, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఫ్రీ లెఫ్ట్ రోడ్లు ప్రజలకు అనుకూలంగా వేయడం స్వాగతిస్తున్నామని మరి టిటిడి కి టిడిఆర్ బాండ్లు ఇవ్వకపోవడంలోని ఆంతర్యం ఏమిటి అన్నదానిపై టీటీడీ ఈవో శ్యామలరావు దృష్టి సారించాలన్నారు.

పులిగోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా తరతరాలుగా అనుభవిస్తున్న భూములు కోల్పోయి ఇప్పటివరకు టిడిఆర్ బాండ్లు ఇవ్వకపోవడం బాధాకరమని నగర అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తమకు ఇప్పటివరకు టిడిఆర్ బాండ్లు ఇవ్వకుండా అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఉన్నఫలంగా గత ప్రభుత్వం టిడిఆర్ బాండ్లను బాధితులకు ఇవ్వకుండా నిలిపివేసి తమని మోసం చేశారని తమకు న్యాయం జరిగేలా ఎన్డీఏ కూటమి నేతలు చోరవ చూపాలన్నారు.

మరో బాధితుడు శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ తమ భూములలో మాస్టర్ ప్లాన్ రోడ్డు మార్కింగ్ లేకపోయినా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహకారంతో అప్పటి అధికార పార్టీ నాయకులు అధికారులు దౌర్జన్యంగా తమ స్థలంలో రోడ్లు వేశారని హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చినా తనకు టిడిఆర్ బాండ్లు ఇప్పటివరకు ఇవ్వకపోవడం కోర్టు ధిక్కరణ కింద పరిగణించి అవినీతి అధికారులను శిక్షించి తమకు వెంటనే టిడిఆర్ బాండ్లు ఇచ్చి న్యాయం చేయాలన్నారు.

నగరపాలక సంస్థ వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో కోల్పోయిన భూములకు సబ్ రిజిస్టర్ ఏ ప్రాతిపదికన ధర నిర్ణయించారు ? టిడిఆర్ బాండ్లు ఎంతకు విడుదల చేశారు?అన్నదానిపై సమాచార హక్కు చట్టం RTI ద్వారా కోరడం జరిగిందని పూర్తి సమాచారం అందిన వెంటనే హైకోర్టులో భూములు కోల్పోయిన బాధితుల తరఫున “పిల్”ప్రజా ప్రయోజనాల వాజ్యం వేయబోతున్నానని నవీన్ తెలిపారు.

Related posts

మంచి కంటి చూపు కోసం  20-20-20 నియమం పాటించాలి

Satyam NEWS

కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు

Satyam NEWS

మార్కెట్ లో క్రయ విక్రయాలు జరగాలి

Murali Krishna

Leave a Comment