తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషం చల్లుతున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. వెంకన్న వెబ్ సైట్ లోకి యేసయ్య ఎలా వచ్చెనయా అంటూ నేడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం జరుగుతున్నదని, సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయని ఆంధ్రజ్యోతిలో నేడు ప్రముఖంగా వార్త ప్రచురించారు. టీటీడీ పంచాంగం పీడీఎఫ్ ఫైల్ లో యేసయ్య పేరు ఉందని కూడా ప్రచురించారు. ఈ ఆరోపణలపై సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు.
కుట్ర పూరితంగానే టీటీడీపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. టీటీడీలో అన్యమత ప్రచారమని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనివెనుక చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ కుట్ర ఉందని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని వారు చూస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం వారు తిరుమలను వాడుకుంటున్నారని, ఇలా కుట్రలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
దీనిపై గూగుల్ కంపెనీని వివరణ కోరామని వారి నుంచి సమాధానం రాగానే వివాదానికి కారణమైనవారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన అన్నారు. అదే విధంగా టీటీడీకి సైబర్ క్రైమ్ విభాగాన్ని ఇవ్వాలని సీఎంను కోరుతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆంధ్రజ్యోతి రాసినట్లు గూగుల్ సెర్చ్ లో మాత్రమే ఆది కనిపిస్తోందని టీటీడీ ఈవో సింఘాల్ వివరించారు. టీటీడీ వెబ్-సైట్ లో అలా లేదని ఆయన అన్నారు.