32.2 C
Hyderabad
March 28, 2024 23: 05 PM
Slider ఆంధ్రప్రదేశ్

టెర్రర్: 426 మంది రైతులపై ఏపీ పోలీసుల కేసులు

CBN 20

గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో, శ్రీకాకుళం జిల్లాలో నిన్న జరిగిన సంఘటనలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ రాజధాని అమరావతి కోసం 34, 281  ఎకరాల భూములు రైతులు ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన భరోసాపై నమ్మకంతో 29, 881మంది  రైతులు భూములు ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులతో  కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నిర్దేశిత అవసరాలకు మాత్రమే వినియోగించాలి. అలాంటిది ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ భూములను, ఇళ్ల పట్టాలకు ఇస్తామనడం అమానుషం, అత్యంత క్రూరత్వం. ప్రపంచానికే ఆదర్శంగా రైతులు రాజధానికి భూములు ఇచ్చారు.

ఇప్పుడు ఆ రాజధానినే తరలిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా 65రోజులుగా రైతులు, మహిళలు, రైతుకూలీలు ఆందోళనలు చేస్తున్నారు. దానిని పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్లిచ్చిన భూములనే పట్టాలు ఇవ్వాలని చూడటం అత్యంత హేయం. ఈ విధమైన దుర్మార్గ చర్యలను ఖండిస్తున్నాం. ఇళ్ల పట్టాలు అర్హులైన పేదలు అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైతే ప్రభుత్వం కొనుగోలు చేసి అయినా ఇవ్వాలి.

అంతేగాని పట్టాల నెపంతో ఈ విధమైన దౌర్జన్యాలు చేయడం అప్రజాస్వామికం, వైసిపి ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ట. ఈ నిరంకుశ పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్య వాదులంతా గర్హించాలి. ఇళ్ల పట్టాల కోసం చెరువు భూములను, అసైన్డ్ భూములను తీసుకోవడాన్ని ఖండిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కోవడం దుర్మార్గం.

భూసేకరణ ద్వారానే గతంలో ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాయి. చెరువు భూములు పూడ్చి, అసైన్డ్ భూములు లాక్కుని పట్టాలు ఇవ్వాలని చూడటం ఇప్పుడే చూస్తున్నాం. అసైన్డ్ దారులకు కూడా భూములపై అన్నిరకాల హక్కులు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి.

అలాంటిది ఇప్పుడీ విధంగా ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ దారులను వైసిపి నేతలు వేధింపులకు గురి చేయడం దుర్మార్గం. జెసిబిలతో చెరువు భూములు పూడ్చి చదును చేసి పట్టాలు ఇవ్వాలని చూడటం అవివేకం. కోర్టులు అక్షింతలు వేసినా పట్టించుకోక పోవడం గర్హనీయం. దశాబ్దాలుగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం దుర్మార్గం. గత 9నెలల్లో బీసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలలో అభద్రతా భావం పెరిగింది. భూముల స్వాధీనం, ఇళ్ల కూల్చివేత, చెరువుల పూడ్చివేత, తప్పుడు కేసులు పెట్టడం, రైతులు, రైతు కూలీలు, మహిళలపై వేధింపులను మానుకోవాలి. ప్రజా వ్యతిరేక చర్యలకు వైసిపి ప్రభుత్వం స్వస్తి చెప్పాలి’’. (నారా చంద్రబాబు నాయుడు) తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు.

Related posts

చంద్రబాబు నివాసంలో రాజ శ్యామల యాగం

Satyam NEWS

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన స్పీకర్

Satyam NEWS

మహా శివరాత్రి ప్రత్యేకం: ఆది అంతం…. అంతా ఆయనే…

Satyam NEWS

Leave a Comment