తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి వాహనం తెలంగాణ సరిహద్దుల్లో కనిపించడంతో ఆ ప్రాంతంలో సంచలనం రేగింది. నల్గొండ మిర్యాలగూడా రహదారి మధ్యలో చంద్రబాబునాయుడి క్యారవాన్ కనిపించడంతో పోలీసులతో సహా అందరూ పరేషాన్ అయ్యారు. అయితే దీనికి కారణం తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలోని పల్నాడు ప్రాంతంలో ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి బుధవారం చంద్రబాబు హాజరవుతారని భావించి ముందస్తుగా క్యారవాన్‌ను తెలుగుదేశం నాయకులు హైదరాబాద్ నుంచి ఆత్మకూరుకు తీసుకువచ్చారు. అక్కడ ఏపీ పోలీసులు ఆ వాహనాన్ని బలవంతంగా అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిలో వాడపల్లి వద్ద సరిహద్దు దాటించారు. మిర్యాలగూడ- నల్గొండ రహదారి మధ్యలో వాహనాన్ని ఆపి వెళ్లిపోయారు. వాహనం లోపలికి వెళ్లే తాళాలను వెంట తీసుకెళ్లగా వాహనాన్ని నడిపే డ్రయివర్ క్యాబిన్ తాళాలను మాత్రమే డ్రైవర్‌కు ఇచ్చారు. అయోమయానికి గురైన డ్రైవర్ ఎన్టీఆర్ ట్రస్టుభవన్కు ఫోన్లో సమాచారమిచ్చారు. వాహనాన్ని మిర్యాలగూడలోని తన సొంత ఇంటి వద్దకు తీసుకొచ్చారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌కు పంపారు.