కృష్ణ గోదావరి నదుల అనుసంధానం పై ఏపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చంద్రబాబునాయుడు ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని ఆయన అన్నారు. గోదావరి-కృష్ణా అనుసంధానం గొప్ప నిర్ణయమని కేసీఆర్ అన్నారు. దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరగనుందన్నారు. దీనిపై పొరుగు రాష్ట్ర సీఎంతో చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలో అవి పూర్తయి ఓ నిర్ణయానికి రానున్నామని చెప్పారు. బాబ్లీ విషయంలో మహారాష్ట్రతో గొడవ పెట్టుకుని ఆయన ఏం సాధించారని కేసీఆర్ ప్రశ్నించారు. అదే మహారాష్ట్రతో తాము సఖ్యతగా మాట్లాడి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు జిల్లాలో 15 నుంచి 18 లక్షల ఎకరాలకు నీరుందుతాయని చెప్పారు. పాలమూరు జిల్లాలను పాలుగారే జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనలో భాగంగా వనపర్తి జిల్లా ఏదులలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిలోపు పాలమూరు-ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని నిర్ణయించామని ఆయన అన్నారు.