29.2 C
Hyderabad
October 13, 2024 15: 20 PM
Slider ప్రత్యేకం

సహాయక చర్యల్లో మోసం చేస్తే చొక్కా పట్టుకుని నిలదీయండి

#chandrababu

డబ్బు ఎంతవుతుందనే కంటే, ఎంతమంది ఇబ్బందులు తొలగించామన్నదే తమకు ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రూ. 6880 కోట్ల నష్టం అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ప్రాథమిక నివేదిక పంపామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందుతోందని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఎవరైనా మోసగిస్తుంటే చొక్కా పట్టుకుని నిలదీసి తీసుకోండని, తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వం అందించే నిత్యావసరాల కిట్లు ఎవరికి అందక పోయినా డిమాండ్ చేసి మరీ తీసుకోండని తెలిపారు. ఇంటింటికీ నిత్యవసరాలు ఇవ్వాలని 75 శాతం మంది కోరుకుంటున్నారన్నారు. కష్టతరమైనా ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇవాళ, రేపట్లో ఇంటింటికీ నిత్యవసరాల పంపిణీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇళ్లకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారి కోసం అర్బన్ కంపెనీతో సమీక్షించామమని, అర్బన్ కంపెనీకి విజయవాడలో తక్కువ మంది నిపుణులు ఉన్నా, ప్రభుత్వం శిక్షణ ఇచ్చిన వారినీ వారికి అనుసంధానిస్తామని తెలిపారు.

ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సబ్సిడీ భరించి తక్కువ ధరకే వివిధ సేవల్ని నిపుణులు ద్వారా అందిస్తామని వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటనలో చాలా మంది ఉపాధి కల్పించమని కోరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వీలైనంత ఎక్కువ మందికి భౌతికంగా, వర్చువల్​గా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వివిధ క్యాటగిరీల వారికి రేపటి నుంచి శిక్షణ ఇస్తామన్నారు. వారం రోజులు టార్గెట్​గా పెట్టుకుని రేపటి నుంచి ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.

వరద సాయం అందరికీ అందకుండా వైఎస్సార్సీపీ ఏమైనా కొన్ని అసాంఘిక బ్యాచ్​లను పంపుతోందా అనే అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు విషయంలోనూ ఈ కుట్రకోణం అనుమానాలు బలపడుతున్నాయన్నారు. వరద సహాయ చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డు లేకున్నా నిత్యావసరాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు అన్ని ఖాతాలనూ ఖాళీ చేసి వెళ్లారని ఆరోపించారు.

సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారని, ఆధారాలు లేకుండా పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేమేదో కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకున్నామని, మా మంత్రులు రాజీనామా చేస్తున్నారని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయకపోగా, ఇష్టానుసారం దుష్ప్రచారాలు చేసేవారిని ఏం చేయాలో అది చేస్తామన్నారు.

తెలుగుదేశం పార్టీపై దాడి కేసుకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అన్ని పాపాలు కలిసి ప్రజలకు శాపాలుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. నగరం వైపు నీరు ప్రవేశించే బుడమేరు 3 గండ్లను ఇవాళ పూర్తిచేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఆర్మీ కూడా అభినందించిందని పేర్కొన్నారు. గండ్లు పూడ్చటం వల్ల నగరంలోకి నీరు రావడం ఆగిందని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదం వల్ల బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు.

గండ్లు పూడ్చి కట్ట పటిష్టం కోసం తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని సైతం ఖర్చు చేయలేదని విమర్శించారు. ఇంకా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజరాజేశ్వరి పేటలో ఇంకా 4 అడుగులు నీరు ఉన్నాయని, అక్కడికి ఆహారం కూడా సరిగా అందలేదని ప్రజలు నేరుగా తనకు ఫిర్యాదు చేశారన్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికీ నగరంలో దాదాపు ఒక టీఎంసీ నీరు ఉందన్నారు. వివిధ ప్రమాద హెచ్చరికల నివేదికలు పరిశీలించి అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Related posts

ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

తెలంగాణ లో నేడు రేపు వర్షం కురిసే అవకాశం

Satyam NEWS

పదవీ బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Satyam NEWS

Leave a Comment