వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్ధం కావడం లేదు. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు దగ్గర ఉండి చక్రం తిప్పిన ఒక వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక మైన విభాగంలో ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చింది. అదే విధంగా కె వి పి రామచంద్రరావు వద్ద చాలా కాలం పని చేసిన ఒక టీచర్ కు రెవెన్యూ మంత్రి వద్ద పోస్టింగ్ ఇచ్చింది. టీచర్లకు ఆ విధులకు తప్ప మంత్రుల దగ్గర పోస్టింగులు రద్దు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జరుగుతున్నా కూడా జగన్ ప్రభుత్వంలో అలాంటి వ్యక్తులు పోస్టింగులు తెచ్చేసుకుంటున్నారు. పోనీ ఆ టీచర్ నిజాయితీ పరుడా అంటే అదీ కాదు అత్యంత అవినీతిపరుడు. నిజాయితీకి మరుపేరుగా ఉండే పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి మంత్రి దగ్గర అత్యంత అవినీతి పరుడిని పెడితే ఇక రెవెన్యూ పాలన ఎలా సాగుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడి పేషీలో అత్యంత కీలక స్థానంలో ఉన్న వ్యక్తి గురించిన విషయాలు తెలుసుకుందాం. ఈ వ్యక్తి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటి నుంచి ఆయన పిఏగా పని చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయినా చంద్రబాబునాయుడితోనే ఉండి తన మాతృశాఖలో ప్రమోషన్లు యథావిధిగా తెచ్చేసుకుంటుంటారు. చంద్రబాబునాయుడి అధికారం పోగానే అతను కూడా అదృశ్యం అయిపోయాడు. మూడు నెలల పాటు కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి ఇప్పుడు అత్యంత కీలకమైన ప్లానింగ్ విభాగంలో ప్రత్యక్షమయ్యాడు. ప్లానింగ్ విభాగం ప్రభుత్వానికి గుండెకాయలాంటిది. అత్యంత రహస్యపత్రాలు ప్లానింగ్ విభాగంలోనే ఉంటాయి. రాష్ట్ర బడ్జెట్ వ్యవహారాలు ఈ విభాగం నుంచే నిర్వహిస్తారు. బడ్జెట్ ఏ విధంగా ఉండాలి అనే అంశం నుంచి కీలక సమాచారం ప్లానింగ్ విభాగం వద్దకే వస్తుంటుంది. అంతటి అత్యంత కీలకమైన ఈ విభాగంలో అత్యంత కీలకమైన పొజిషన్ లో చంద్రబాబునాయుడి మనిషిని పెట్టేశారు. అయ్యా ఇదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నది. ఈ రెండు కేసులే కాదు. చంద్రబాబునాయుడి హయాంలో కీలక బాధ్యతల్లో ఉండి అడ్డగోలు పనులు చేసిన చాలా మంది అధికారులు జగన్ ప్రభుత్వంలో కూడా కీలకమైన విభాగాల్లో పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. కొనసాగుతూనే ఉన్నారు.
previous post
next post