2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి జగన్ కేంద్ర సర్వీసుల్లో ఉన్న ధర్మారెడ్డిని డిప్యూటేషన్‌పై టీటీడీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఈయన్ని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన కోసం ‘అదనపు ఈవో’ అనే పోస్టు సృష్టించి నియమించారు.
టీటీడీ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డి సీఎస్ఎస్ గా వెళ్లడంతో… ఈవో పదవికి ధర్మారెడ్డి వచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ ఈవోను నియమించకుండానే ప్రభుత్వం ఈయన్ను కొనసాగించింది. తిరుమలకు కనీసం జేఈవోను కూడా నియమించకపోవడం విశేషం. జగన్ ప్రభుత్వం మద్దతుతో టీటీడీలోకి వచ్చిన ధర్మారెడ్డి వివాదాస్పద నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారారు. సీఎంకు సన్నిహితుడు కావడంతో గతంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తప్పించి నియంతృత్వ పోకడలతో వ్యవహరించారనే విమర్శలు లేకపోలేదు.
వీఐపీ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల సంఖ్యను విపరీతంగా పెంచడం వల్ల సర్వదర్శనాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పెంచారు. దీంతో సామాన్య భక్తుల క్యూలు రెండు, మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది విమర్శల పాలవుతున్నాయి. ఇన్ని కిలోమీటర్ల మేర క్యూ లైన్లు పెరిగినా.. ఏ రోజూ దర్శనాలు లక్ష దాటిన దాఖలాలు లేవు. వైసీపీ నేతలకు ఇష్టానుసారంగా వీఐపీ బ్రేక్ టిక్కెట్లు ఇవ్వడంతో సామాన్యులు దర్శనానికి రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు.
ముఖ్యంగా వీఐపీ బ్రేక్ టిక్కెట్లను శ్రీవాణి ట్రస్టుతో కలిసి రూ.10,500కు విక్రయించి ఆ ట్రస్టు ఆదాయాన్ని ప్రభుత్వానికి మళ్లిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. గతంలో సర్వదర్శనం భక్తులకు కంపార్ట్ మెంట్లలోనే కడుపునిండా అన్నదానం చేసేవారు. దీనివల్ల అదనపు భారం కావడంతో వీటిని కూడా తగ్గించారనే విమర్శలకు కారకులయ్యారు. కనీసం తల్లిపాలు తాగే చిన్నారులకు కూడా పాలు అందడం లేదని భక్తుల నుంచి పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యూలైన్లలో తాగునీరు కూడా అందించకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
టోకెన్ రహిత దర్శనాలను పూర్తిగా రద్దు చేసే దిశగా అడుగులు వేయడం భక్తులకు అసంతృప్తిని మిగిల్చింది. ఇక ఏదో ఒక టికెట్, టోకెన్ ఉంటేనే తిరుమలకు వచ్చేలా అతీ గతీలేని వ్యవహరించారు. వృద్ధులు, వికలాంగులు, టిక్కెట్లు ఆన్‌లైన్‌కే పరిమితం చేసారు. దీంతో అనేక మంది వృద్ధులు, వికలాంగులు కిక్కిరిసిన క్యూలైన్లలోకి వెళ్లలేక, కనుచూపు మేరలో వెనుదిరగాల్సిన సందర్భాలు అనేకం ఉన్నాయి. స్వామివారికి నైవేద్యంగా పెట్టె అన్నప్రసాదాలను దర్శనం పూర్తిచేసుకున్న భక్తులు ఇచ్చే సంప్రదాయాన్ని కూడా స్వస్తి పలికారు.
ప్రసాదం నాణ్యతపై భక్తులు చాలాసార్లు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకున్న నాధుడు లేదు. మరోవైఫు ఉద్యోగులు తమ సమస్యలపై ఆందోళన చేపట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యోగం నుంచి తొలగించడం, సస్పెండ్ చేయడం లేదా ఒకచోట నుంచి మరో చోటికి బదిలీ చేయడం వంటివి చేసేవారు. అయితే జగన్ సర్కారు అధికారంలోకి రాగానే టీటీడీకి వచ్చిన ధర్మారెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. వైసీపీ అండతో మరింత మొండిగా వ్యవహరించారని ఉద్యోగులు తెలిపారు… ఈ ఐదేళ్లలోనూ అదేస్థాయిలో విమర్శలను ఎదురుకొన్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో టీటీడీ ఈవో నుంచి ఆయనని ప్రభుత్వం తొలగించింది.
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రక్షాళన మొదలుపెట్టారు.. ముఖ్యంగా సెక్రటేరియట్‌లో అడుగుపెట్టిన వెంటనే ఆయన వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ వీర విధేయ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై విరుచుకుపడ్డారు.. తాజాగా వారిపై చంద్రబాబు నాయుడు వేట మొదలయింది.. నిబంధనలకు విరుద్ధంగా జగన్ కోసం ఇష్టారాజ్యంగా వ్యహరించిన అధికారులపై వేటు పడుతోంది.. ఇప్పటికే పలువురు అధికారులకు చెక్ చెప్పిన సీఎం తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డిని విధుల నుండి తప్పించారు.. ఆయనపై బదిలీ వేటు వేశారు.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమలకు వచ్చిన చంద్రబాబు నాయుడు తిరుమల నుండే ప్రక్షాళన చేపడతామన్నారు.. ఆ హామీ మేరకే ఆయన టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై చర్యలు చేపట్టారు.. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు, నమ్మిన వ్యక్తి ధర్మారెడ్డి నుంచే యాక్షన్ ను ప్రారంభించారు. ధర్మారెడ్డిని టీటీడీ ఈవో బాధ్యతల నుంచి తప్పించి అడిషనల్ ఈవో స్థాయికి పరిమితం చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న 1997 బ్యాచ్‌కు చెందిన జె.శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పదవి బాధ్యత లు స్వీకరించారు.