అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తొలి సారిగా రుషి కొండ వచ్చారు. జగన్ రెడ్డి ప్రజా ధనం లూటీ చేసి నిర్మించిన ప్యాలెస్ ను ఆయన సందర్శించారు. విశాఖ రుషికొండ ప్యాలెస్‌కు ప్రత్యేక హెలికాఫ్టర్లో సీఎం చేరుకున్నారు. మొదటిసారిగా రుషికొండ ప్యాలస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేనివాడు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతాడని ఆయన జగన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విశాఖ రైల్వే జోన్‌కు గత పాలకులు భూమి ఇవ్వలేదని.. తాను వచ్చిన వెంటనే భూములు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పరుగులు పెట్టిస్తానన్నారు. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి పారిశ్రామికవేత్త మిట్టల్ ముందుకు వచ్చారన్నారు. ‘‘డ్వాక్రా సంఘాలు మా మానస పుత్రిక ..దీపం 2 కింద ఆడబిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. నిన్న నేను టీ చేశాను.వంట చేయడం చాలా ఈజీ’’ అని చెప్పుకొచ్చారు. మెగా డీఎస్సీ ఇచ్చానని.. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేసి.. ప్రజల భూములను కాపాడినట్లు తెలిపారు. 175 అన్న క్యాంటీన్లు పెడితే సహించ లేకపోతున్నారన్నారు.
నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడారని.. ఇలాంటి వారు రాష్ట్రానికి అరిష్టమంటూ వ్యాఖ్యలు చేశారు. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇచ్చామన్నారు. ఉచిత ఇసుక ఇస్తున్నామని.. మీ ఊర్లో ఇసుకకు వేరే వాళ్ళ పెత్తనం ఏమిటి అని ప్రశ్నించారు. మద్యం రేట్లు పెంచితే ఊరుకోనేది లేదని హెచ్చరించారు. బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. చెత్త పన్ను తీసేశామని.. రాష్ట్రంలో పేరుకు పోయిన చెత్త తీయాల్సి ఉందన్నారు. అత్యాచారం చేసే వారిని నడి రోడ్డు మీద ఊరి తీయాలన్నారు.
మహిళలను వేధిస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మక్కెలు విరగగొట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వరద బాధితులకు డ్రోన్ సహాయంతో ఆదుకున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు , స్థలం ఇచ్చే బాధ్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.