28.7 C
Hyderabad
April 20, 2024 04: 09 AM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చెత్తపలుకు:నువ్వేనా తెలివిగలవాడివి?

ap secratariat

ఆంధ్రోళ్లు తెలివైనవాళ్లు అనుకుంటే గిట్ల చేసుకుంటున్నారు ఏందిరా? ఆంధ్రజ్యోతిలో నా సీనియర్ కొలీగ్ తండ్రి వేసిన ప్రశ్న ఇది…… అంటూ మొదలు పెట్టాడు చెత్తపలుకు. ఆంధ్రప్రదేశ్ కు ఏమైందట? అక్కడ కొంపలు ఏం అంటుకు పోయాయట? జగన్ సి ఎం అయ్యాడన్న కసి, సిబి నాయుడు ఓడిపోయాడన్న దుగ్ధ తప్ప. ఆంధ్రావాళ్లు తెలివిగల వారని జగన్ కు 151 సీట్లు ఇచ్చి ఇటీవలే నిరూపించుకున్నారు. అదే నీ రాతలు, సిబి నాయుడి మాటలు నమ్మి ఉంటే మళ్లీ నీవనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఆంధ్రోళ్లు తెలివిగలవారు అనేదానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? అతి తెలివితో ఆంధ్రోళ్లు రాజధాని లేకుండా విడిపోయారు అని రాస్తున్నాడు చెత్తపలుకుగాడు. చరిత్రను వక్రీకరించడం ఇలాంటి వాళ్లకు జన్మతో వచ్చిన ఆర్టు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని మారుస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడా? పోనీ బొత్స సత్యనారాయణ చెప్పాడా? శివరామకృష్ణ కమిటీ నివేదికను ప్రస్తావించిన బొత్స సత్యనారాయణను విలన్ గా చూపిస్తూ ఎల్లో మీడియా ఎంత గొడవ చేస్తున్నదో చూస్తున్నాం. సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని ఖాళీ చేసేయాలని అక్కడ నీళ్లు ఉంచకూడదని చెబుతున్న సిబి నాయుడి పాలనాదక్షతను ఇప్పటికే అందరూ అర్ధం చేసుకున్నారు. జగన్ కు అమరావతి అంటే ముందు నుంచి ఇష్టం లేదట. నిజమే కావచ్చు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఎల్లో మీడియా లాగా చప్పట్లు కొట్టాలా?

ఒక్క విషయంలో రాధాకృష్ణను మెచ్చుకోవచ్చు. అమరావతి చుట్టూ కమ్మ కులస్తులే ఉన్నారని వారే భూములు ఇచ్చారని రెడ్డి కులస్తులు భూములు ఇవ్వలేదని నిజం రాశాడు. సిబి నాయుడు అధికారంలో ఉన్నంత కాలం ఇదే విషయాన్ని అందరూ చెబుతుంటే – అలా కాదు మా బాబు చేస్తున్న పనులను చూసి అందరూ ముందుకు వచ్చి భూములు ఇచ్చేశారు -అని రాసిందీ ఎల్లోమీడియా. రాజధాని ప్రకటన తర్వాత ఎవరెవరో భూములు కొనుగోలు చేశారని రాస్తున్నాడు. ఇది శుద్ధ అబద్ధం. తెలుగుదేశం నాయకులు, అదీ కూడా సిబి నాయుడి కులానికి సంబంధించిన వాళ్లు భూములు కొన్న తర్వాతే అక్కడ రాజధాని ప్రకటించారు.

ఇక ముంపు విషయాన్ని ప్రస్తావిస్తూ తన అతి తెలివి తేటల్ని ప్రదర్శించాడు. నాగరికత అనేది నదులు ఉన్న చోటే వికసిస్తుందనే సోషల్ సైన్స్ పాఠాన్ని వల్లెవేస్తున్నాడు. నీళ్లను తాను ఉన్న చోటుకు తీసుకువెళ్లే సౌకర్యాలను అభివృద్ధి చేసుకున్న మానవుడు అన్నీ బాగున్న చోటే నగరాలు నిర్మించుకుంటున్నాడు. నీ చెత్తపలుకు సోషల్ సైన్స్ లో నదులను పూడ్చి కట్టిన రాజధాని ఎక్కడైనా ఉందా సోదరా? ఉంటే పాపం ఆ తెలివితక్కువ ఆంధ్రోళ్లకు చెప్పు. బంగారం లాంటి పొలాలు, మూడు కాదు నాలుగైదు పంటలు పండే జరీబు భూములలోని అరటి తోటల్ని బుల్డోజర్లతో నేలమట్టం చేసి, అత్యంత విలువైన పంటలు పండే సారవంతమైన భూముల గుండెలపై రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన సిబినాయుడి గురించి నీవు ఎంత గొప్పగా చెప్పినా తెలివి లేని ఆంధ్రోళ్లు వినరు సోదరా.

ఆ ప్రాంతంలో కమ్మ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. వారంతా భూముల్ని ఇతర కులాల వారికి కౌలుకు ఇచ్చి పట్టణాలకు వెళ్లిపోయారు. కొందరైతే అమెరికాలో సెటిల్ అయ్యారు. అమరావతిని రాజధాని చేస్తానని సిబి నాయుడు చెప్పిన తర్వాత దశాబ్దాల పాటు కౌలు చేసుకుంటున్న పేదవారిని ఈ భూకామందులు బలవంతంగా వెళ్లగొట్టి ప్రభుత్వానికి భూములు అప్పగించారు. పరిహారం భూకామందులకు దక్కింది. ల్యాండ్ పోర్సన్ వారి పేరుతోనే వచ్చింది. భూమి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా కౌలు సొమ్మును ప్రభుత్వం ఈ కమ్మ వారికే ఇచ్చింది. ఇది సోదరా వాస్తవం. పేద రైతులు అలో లక్ష్మణా అంటూ అక్కడ నుంచి వలసపోయారు. సిబి నాయుడు కాంట్రాక్టు ఇచ్చిన సంస్థలు బీహార్, ఉత్తర ప్రదేశ్ నుంచి కూలీలు తెచ్చుకున్నారు తప్ప స్థానికుల్ని కనీసం కూలీలుగా కూడా ఉపయోగించుకోలేదు. అందుకే మందళగిరిలో యువరాజు దారుణంగా ఓడిపోయాడు.

ఎడ్డెం అంటే తెడ్డెం అనేవారు ఏపిలో ఎక్కువగా కనిపిస్తారట. మరి అలాంటి వారికి నువ్వు పేపరెందుకు అమ్ముతున్నావు? ఆ ఎడ్డెం అంటే తెడ్డెం అనే వారు నీ పేపర్ బంద్ చేస్తే నీకు పుట్టగతులు కూడా ఉండవు. ఆంధ్రాలో అన్ని పనులూ ఆపేశారని గోల. వర్షాకాలం పనులు ఆగడం సహజమే కదా సోదరా? ఈ లోపు అన్నీ సమీక్షించి పనులు మొదలు పెడతారు. అరచి గోల చేసినంత మాత్రాన చేసిన అవినీతి పనులను కప్పెట్టేయడం సాధ్యమౌతుందా రాధాకృష్ణా? చంద్రబాబుపై కక్షతో జగన్ ఇదంతా చేస్తున్నాడట. ఇదో కొత్త థియరీ. జగన్ ఇంకా తనకున్న ఒరిజినల్ స్పీడ్ ప్రకారం చేయడం లేదని చాలా మంది అనుకుంటున్నారు. జగన్ ఇంకా స్పీడ్ పెంచాలని కోరుకుంటున్నారు బ్రదర్. అది తెలుసుకో.

నవయుగ కు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే సరికి సిబినాయుడు, రాధాకృష్ణ సామాజిక వర్గానికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. సిబి నాయుడు, రాధాకృష్ణ కలిసి బిజెపిలోకి పంపిన సుజనా చౌదరి ఢిల్లీలో చేసిన లాబీ ఫలితంగా వస్తున్న వ్యాఖ్యాలను జగన్ ప్రభుత్వం ఇప్పడికైనా అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏపి వృద్ధి రేటులో తిరోగమనం కనిపించిందట. అహా అలానా? మూడు నెలలకే ఎన్ని నిజాలు బయటకు వస్తున్నాయో. ఏపిలో ప్రధాని మోడీపై ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభిమానం పెరిగిందట. ఓ సోదరా మోడీ పై ఏపిలో ఎప్పుడూ వ్యతిరేకత లేదు. వ్యతిరేకత ఉందని నువ్వు, సిబి నాయుడు భ్రమపడ్డారు. అందుకే మోడీని బండ బూతులు తిట్టారు. అయినా మోడీ పరోక్షంగా సమర్ధించిన జగన్ నే ప్రజలు గెలిపించారు తప్ప సిబి నాయుడికి ఓట్లు రాల్చలేదు.

40 శాతం ఓట్లు వచ్చాయని అంటావేమో నువ్వే చెప్పావు కదా కమ్మ వారు ఓట్లు వేశారని. రాజధాని కోసం 33 వేల ఎకరాలను కమ్మ వారు ఇచ్చారు అని రాస్తున్నావు. మరి ఆ కమ్మ వారు సిబి నాయుడికి ఓటు వేయలేదా? మరి అక్కడ రెడ్డి ఎందుకు గెలిచాడు? లాజిక్కులు నీకే కాదు అందరికి తెలుసు సోదరా. రెడ్లు రాజధానికి భూములు ఇవ్వలేదని రాసేస్తున్నావు ఇదేనా నీ సంస్కారం? కులం పేరుతో నేరుగా రాయడం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నావు? నీ కమ్మోరు, రెడ్లు తప్ప ఆంధ్రప్రదేశ్ లో వేరే కులాలు లేవా? రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మోడీ సహకారం తప్పని సరి అని ఏపి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారట- వామ్మో ఇన్ని నిజాలు ప్రజలు జీర్ణించుకోలేరు బాబూ. ఒక్క విషయం చెప్పనా- ఈ సంగతి నీకు, సిబినాయుడికి ఇప్పుడు తెలిసినట్లుంది. కానీ ప్రజలకు ఎప్పుడో తెలుసు. బహుశ నీ సలహా విని సిబి నాయుడు మోడీ తో పంచాయితీ పెట్టుకున్నట్టున్నాడు.

అందుకే నీవేదో రాజకీయ పండితుడిలాగా సిబి నాయుడికి సలహాలు ఇవ్వవద్దు. అవినీతికి ఎన్నికలకు సంబంధం లేదట అందుకే జగన్ గెలిచాడట. వినేవాడుంటే ఏం చెబుతావు బ్రదర్. జగన్ అవినీతి సంగతి ఏమో కానీ సిబి నాయుడి అవినీతి, కులప్రీతి వల్లే ఘోర ఓటమి చవిచూశాడు. ఇది నీకు తెలియకపోవచ్చు కానీ ఏపి ప్రజలందరికి తెలుసు. దురదృష్టం ఏమిటంటే జగన్ ఎవరి మాటా వినరు – అని చెత్తపలుకులో రాశాడు. అది నీకు దురదృష్టమేమో కానీ ఏపి ప్రజల అదృష్టం. ఎందుకంటే అధికార లాబీల్లో తిరిగేవారి మాట విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే చంద్రబాబు 23కు వచ్చాడు.

మరీ ముఖ్యంగా జగన్ నీ మాట వినే అవకాశం అస్సలు లేదు. జగన్ రాజకీయ కక్షతో రాజ్యం ఏలితే ఈ పాటికి సిబి నాయుడు ఆయన పరివారం జైల్లో ఉండేవారు. ఎందుకో జగన్ గతంలో మాదిరి ఉండటం లేదు. ఇదే పెద్ద లోటుగా కనిపిస్తున్నది. అవినీతిని వెలికి తీస్తుంటే వారెవరో అడ్డుకుంటున్నారని జగన్ చెప్పవచ్చు కానీ- అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు చెత్తపలుకువాడు. సిబినాయుడులాగా నెపాన్ని ఇతరులపైకి నెటేవాడు కాదు జగన్. అమరావతిలో కట్టిన భవనాలు తాత్కాలిక రాజధాని అని ఎవరు చెప్పారు? జగన్ చెప్పాడా? తాత్కాలిక భవనాలను మారిస్తే తప్పేంటి? ఎందుకు ఈ గోల? అయినా ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కదా? మీరు కొన్న భూములను కాపాడుకోవడానికేనా ఈ గోలంతా? చంద్రబాబు వేరే సామాజిక వర్గాలను దెబ్బతీయడానికి కాదా అమరావతిని రాజధానిగా ఎంచుకున్నది? మేధావులు వద్దువద్దంటున్నా ఎవరి మాటైనా సిబి నాయుడు విన్నాడా?

రాజధాని ఎంపిక చేసేటప్పుడు అఖిలపక్షం పిలిచి అందరి అభిప్రాయం తీసుకుని కట్టినట్లు ఈ ఫోజు ఏమిటి?రాజధాని మారుస్తారని పుకారు లేపింది ఎవరు? గోల చేసింది ఎవరు? ప్రజలు ఉద్యమం చేశారా? ధర్నాలు, హర్తాళ్లు చేశారా? ఆంధ్రా మేధావులను పీతలతో పోల్చాడటం ఒక తెలంగాణ నాయకుడు. రాధాకృష్ణా ఎవరు ఆ తెలంగాణ నాయకుడు చెప్పగలవా? నీవే ఊహించుకుని నీవే రాసుకుని వేరేవారికి ఆపాదించడం ఏ రంగు జర్నలిజం కిందికి వస్తుంది?

Related posts

Vijayanagaram Police: ఒకేసారి 20 మంది ఎస్ఐ లకు స్థానచలనం

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ ఇంట్లో కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ…!

Satyam NEWS

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు – 2020 వాహ‌న‌సేవ‌లు

Satyam NEWS

Leave a Comment