30.2 C
Hyderabad
September 14, 2024 17: 32 PM
Slider సంపాదకీయం

దేశ రక్షణపై మోడీ నిర్ణయం సంచలనమే

modi 123

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయంపై కొందరిలో ఆశ్చర్యంతో కూడిన భయం, అనుమానంతో వచ్చే ఆందోళన వ్యక్తం అవుతున్నది. దేశంలోని సైనిక బలం, వాయు సేన, నావికాదళం ప్రస్తుతం వేరు వేరుగా విధులు నిర్వర్తిస్తుంటాయి. అత్యవసర సమయాల్లో ఈ త్రివిధ దళాలకు చెందిన కమిటి ఒకటి పని చేస్తూ ఉంటుంది. ఈ విధమైన ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని చాలా కాలంగా ఒక వాదన ఉంది. అయితే ఫలితం సంగతి తర్వాత ఈ మూడు దళాలను కలిపి ఒకే వ్యక్తి ఆపరేట్ చేయడం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయనేది ఒక భయం. ఈ భయం, ఆందోళన మధ్య చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు చేయడం వెనుకబడి పోయింది. ఉన్నత స్థాయి పౌర అధికారులు, సైనిక అధికారుల మధ్య ఈ అంశంలో చాలా కాలంగా వివాదం నడుస్తూనే ఉంది. రెండు రకాల బలమైన వాదనలు వినిపిస్తున్న తరుణంలోనే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల మధ్య చాలా కాలం ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మూలన పడిపోయింది. దేశ రక్షణ శాఖ మంత్రిగా మనోహర్ పారికర్ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు బూజు దులిపారు. రాజకీయ ఏకాభిప్రాయం సాధించే దిశగా ఆయన పావులు కదిపారు. అదే విధంగా ఉన్నత స్థాయి అధికారులు, సైనిక అధికారుల మధ్య సమన్వయం కూడా మనోహర్ పారికర్ సాధించారు. దాంతో అప్పటి నుంచే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను నియమించాలనే ఆలోచనలు మొదలయ్యాయి. మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రిగా కొనసాగి ఉన్నట్లయితే బహుశ అప్పటిలోనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చేదేమో కానీ రాజకీయ అనివార్యతలతో ఆయన గోవా ముఖ్యమంత్రిగా వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి మళ్లీ బూజు పట్టిపోయిన ఈ ప్రతిపాదనను ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బహిరంగంగా చెప్పేసి అన్ని వ్యతిరేక వాదనలకు చెక్ పెట్టేశారు. ప్రపంచంలోని చాలా ప్రజాస్వామిక దేశాలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఒకే అధికారి కింద త్రివిధ దళాలు పని చేసే ఏర్పాటు కూడా ఉంది. చివరికి పాకిస్తాన్ లో కూడా ఇలాంటి వ్యవస్థ  ఉన్నది. పాకిస్తాన్ లో ఒకే అధికారి కింద ఆర్మీ, నావి, ఎయిర్ ఫోర్సుతో బాటు మెరైన్ ఫోర్సు, పారామిలిటరీ ఫోర్సు కూడా పని చేస్తాయి. ఆ అధికారిని ఒక సారి ఆర్మీ నుంచి నియమిస్తే తర్వాతి విడతలో నావి నుంచి ఆ తర్వాత ఎయిర్ ఫోర్సు నుంచి ఇలా రొటేషన్ పద్ధతిలో చీఫ్ ను నియమిస్తారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో ఎయిర్ ఫోర్సుకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో భారత్ దారుణమైన దెబ్బతిన్నది. అదే విధంగా 1965లో నావికాదళానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆర్మీ మోహరించేసింది. 1965, 1971లో కూడా భారత త్రివిధ దళాల మధ్య ఎలాంటి సమాచార మార్పిడి లేకుండానే యుద్ధాలు జరిగాయి. అయితే అప్పటిలో త్రివిధ దళాలకు ఉన్న అధిపతులు అందరూ కూడా సఖ్యత ఉన్నవారు కావడం వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోని సమగ్ర వ్యూహం రచించి విజయం సాధించారు. కార్గిల్ యుద్ధం సమయంలో ఇదే విధంగా త్రివిధ దళాల మధ్య సఖ్యత అంతగా కనిపించని విషయం కూడా అప్పటిలో చర్చనీయాంశమైంది. కథ సుఖాంతం అయింది కానీ త్రివిధ దళాల మధ్య సఖ్యతపై పలు ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్సు లలో పని చేయకుండా కేవలం కొద్ది కాలం శిక్షణ తీసుకున్న ఒక ఐఏఎస్ అధికారిని రక్షణ శాఖ కార్యదర్శిగా నియమించుకుని దేశ రక్షణ బాధ్యతలు అప్పగించడం ఒక్క భారత దేశంలోనే జరుగుతుంది అని గతంలో రక్షణ రంగ నిపుణులు పలుమార్లు వ్యాఖ్యానించేవారు. ఇప్పుడు అలాంటి లోపాలను సరిదిద్దేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ కొత్త ఏర్పాటు చేస్తున్నది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మూడు విభాగాలను సమన్వయ పరచి సమాచారాన్ని క్రోడీకరించి ప్రభుత్వం ముందు ఉంచడం, క్లిష్ట సమయాలలో ఏం చేయాలో ప్రభుత్వానికి మార్గదర్శనం చేయడం లాంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. త్రివిధ దళాల బాధ్యుల విధుల్లో జోక్యం చేసుకుని అసలు పని కానివ్వకుండా అడ్డుపడే వాడుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండరాదు. ఈ జాగ్రత్తను ప్రభుత్వం తీసుకోవాలి. త్రివిధ దళాలను సమన్వయ పరచి లోపాలను సరిదిద్ది ఒకే వ్యూహం రచించి శత్రువును దెబ్బ కొడితే దేశానికి తిరుగు ఉండదు.  

Related posts

కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు విఫలం

Satyam NEWS

వ్యాయామ ఉపాధ్యాయుడు బాల మోహన్ కు నంది అవార్డు

Satyam NEWS

పోరాటాలు లేకుండానే గిరిపుత్రుల హామీలన్నీ పూర్తి చేసాం

Satyam NEWS

Leave a Comment