వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుండి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్. కె.జోషి ఆదేశించారు. మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, ఆర్ధిక శాఖ అధికారి శివశంకర్, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ శ్రీమతి క్రిస్టినా జడ్ చొంగ్తూ,దేవాదాయశాఖ కమీషనర్ అనీల్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డిజి సంజయ్ కుమార్ జైన్, ములుగు కలెక్టర్ నారాయణ రెడ్డి, పిసిసిఎఫ్ శోభ, సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే లతో పాటు ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, విద్యుత్, వైద్య, RWS,RTC, పోలీస్ తదితరశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారని, ప్రతి శాఖ తమకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. వచ్చే 10 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ ను రూపొందించి సౌకర్యాలను మెరుగు పరచాలన్నారు. జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణహితంగా అడవులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలన్నారు. జాతర ఏర్పాట్ల కోసం భూసేకరణకు సంబంధించి భూములు ఇచ్చేవారికి స్వయం ఉపాధి కల్పించి ఎంటర్ ప్రిన్యుర్ షిప్ అభివృద్ధి చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గత సంవత్సరపు జాతర నిర్వహణలో ఏర్పడిన లోటు పాట్లను దృష్టిలో ఉంచుకొని పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం, పార్కింగ్, బందోబస్తు, బస్సు సర్వీసుల ఏర్పాటు, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నిర్వహణ, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్ధ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. వివిధ శాఖలు తమకు కేటాయించిన పనులను డిసెంబర్ చివరినాటికి పూర్తి చేయాలన్నారు. క్యూలైన్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గత జాతరలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల పరికరాలను తిరిగి వాడుకునేలా చూడాలన్నారు. జాతరలో Dos & Don’ts పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పోలీసు శాఖ ద్వారా సిసి టివి ల ఏర్పాటు తో పాటు బందోబస్త్, ట్రాఫిక్ నిర్వహణను వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టాలన్నారు. సమాచార శాఖ ద్వారా మీడియా సెంటర్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు
previous post
next post