27.7 C
Hyderabad
April 25, 2024 07: 45 AM
Slider ప్రపంచం

ప్రమాదకరంగా ముందుకు వస్తున్న దుష్ట చైనా

#china boarder

చైనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండకపోతే మనం భారీమూల్యం చెల్లించాల్సి వుంటుంది. దొంగదెబ్బ తీయడం చైనా నైజమని మనకు అనుభవాలు నేర్పుతున్నాయి. ప్రస్తుతం లడాఖ్ సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలు లేకపోయినా,యుద్ధం ఎప్పుడు వచ్చినా ఢీకొనడానికి చైనా సంసిద్ధమవుతోంది.

వాస్తవాధీన రేఖ వెంట తన ఆధిపత్యాన్ని నిలుపుకొనే పనులను ముమ్మరం చేస్తోంది.వివాదాస్పద ప్రాంతాలకు అత్యంత వేగంగా తమ బలగాలను తరలించేందుకు వీలైన చర్యలు చేపడుతోంది. వాస్తవాధీన రేఖ సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తోంది. ఉత్తర సిక్కింలోని నకులా ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు దగ్గరలో తమ భూభాగంలో చైనా కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టింది.

సరిహద్దుల్లో వేగంగా కదులుతున్న చైనా

గత సంవత్సరం భారత్ – చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఈ నిర్మాణాలు అతి సమీపంలోనే ఉన్నాయి.దీనితో పాటు తూర్పు లడాఖ్,అరుణాచల్ సెక్టార్ల దగ్గర కూడా ఈ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల వల్ల సరిహద్దుల్లో ఎక్కువకాలం బలగాలను మొహరించడానికి అవకాశం ఉంటుంది.

అక్కడి రోడ్డు మార్గాలను కూడా మెరుగుపరచింది. మొత్తంమీద,సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బాగా పెంచుకొని మనల్ని దెబ్బతీయడానికి చైనా సంసిద్ధమవుతోంది.ఇరు దేశాల మధ్య ఘర్షణల విరమణల దిశగా అనేకసార్లు చర్చలు జరిగాయి. తూర్పు లడాఖ్ ప్రాంతంలో బలగాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి.

ఈ నేపథ్యంలో,పాంగాంగ్ సరస్సు నుంచి చైనా తన బలగాలను వెనక్కు పిలిపించుకుంది. వాటిని టిబెట్ కు తరలించింది.గల్వాన్ లోయలో ప్రస్తుతం ఘర్షణ వాతావరణం లేకపోయినా మనముండే జాగ్రత్తలో మనం ఉండాలి.ఈ ఏడాది ఫిబ్రవరిలో బలగాల ఉపసంహరణ ఒప్పందం కుదిరినప్పటి నుంచీ ఎటువంటి అతిక్రమణలు లేవని మన సైన్యం అంటోంది.ఇది మంచి పరిణామామే కానీ,చైనాను నమ్మి ఆదమరచి ఉండలేం.

ఉల్లం‘‘ఘనులు’’ చైనా, పాకిస్తాన్ లు

ఒప్పందాల ఉల్లంఘన ఇటు చైనాకు – అటు పాకిస్తాన్ కు  కొత్తేమీ కాదు. నిరుడు గల్వాన్ లోయలో జరిగిన ఘోరకలిని మర్చిపోలేం.తాజాగా జమ్మూలో కలకలం రేపుతున్న డ్రోన్ కదలికలను తేలికగా తీసుకోడానికి వీలులేదు.తాలిబాన్ కబంధ హస్తాల్లోకి అఫ్ఘానిస్థాన్ వెళ్లిపోయింది.

చైనా -పాకిస్తాన్ మధ్య బంధాలు ఈమధ్య కాలంలో బాగా పెరిగాయి. చైనా,పాకిస్తాన్,తాలిబాన్ ఆక్రమణలో ఉన్న అఫ్ఘాన్ మనకు శతృదేశాలే. భారత్ ను అణచివేయడానికి ఈ మూడు ఏకమవుతాయి.అమెరికా మీద అతిగా విశ్వాసం పెట్టుకోవడం కూడా తెలివైన పనికాదు. భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ అమెరికా నాటకాలు ఆడుతోందన్న విషయం పరిశీలకులు గమనిస్తూనే ఉన్నారు.

రక్షణ రంగంలో,ఆర్ధిక ప్రపంచంలో మన బలం ఇంకా ఎన్నోరెట్లు పెరగాల్సి వుంది.దౌత్యపరమైన అంశాల్లో,విదేశాంగ విధానంలో మన అడుగులు మరింత చురుకుగా సాగాలి. అమెరికాతో బంధాలను పెంచుకుంటూనే,రష్యాతో బంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి.యూరప్ దేశాలతోనూ మన స్నేహం ఇంకా దృఢపడాలి.

దొంగ దెబ్బ కొడుతున్న చైనా హ్యాకర్లు

చైనాతో బంధాలను పూర్తిగా చెడగొట్టుకోకుండా,ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరిస్తున్న ఆ దేశంతో బంధాలను కాపాడుకుంటూనే, మన స్వశక్తిని పెంచుకోవాలి. ఇదిలా ఉండగా,చైనా హ్యాకర్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.

మన దేశ రక్షణ శాఖ,ప్రభుత్వ,కార్పొరేట్ సంస్థల వెబ్ సైట్లపై దాడులు చేస్తూ వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వింటున్నాం.ఇప్పటికే పలు చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అన్నింటికీ చైనాపై ఆధారపడకుండా దేశీయ యాప్ లను నిర్మాణం చేసుకోవల్సిన అవసరం బలంగా ఉంది.

మొదటి నుంచీ అనేక రంగాల్లో చైనా వంటి దేశాలపైన ఆధారపడడానికి మనం అలవాటు పడ్డాం. ఇంచుమించు ఓకే కాలంలో రెండు దేశాలు ప్రగతి వైపు ప్రయాణాన్ని ఆరంభించాయి.కానీ,ఈ రేసులో మనం వెనకబడి పోయాం. అమెరికాను కూడా దాటిపోయే స్థాయికి చైనా ఎదిగింది.ఆ దేశాలపైన ఆధారపడాల్సిన పరిస్థితిలోనే ఇంకా మనం ఉన్నాం.

ఆత్మనిర్భర్ ప్రేరణ అన్నింటా నింపుకొని అతివేగంగా ముందుకు సాగడమే మనకు తరుణోపాయం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల పట్టివేత

Satyam NEWS

సూసైడ్ అట్టెంప్ట్: వేములవాడలో జంట ఆత్మహత్య యత్నం

Satyam NEWS

షేక్ పేట్ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment