ప్రపంచంలోని పొడవైన నదులలో ఒకటి అయిన బ్రహ్మపుత్ర పై చైనా నిర్మిస్తున్న అతి పెద్ద ఆనకట్ట భారత్, బంగ్లాదేశ్ లకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. యార్లంగ్ త్సాంగ్పో దిగువ ప్రాంతంలో (బ్రహ్మపుత్ర) ప్రాజెక్ట్‌ను నిర్మించాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. చైనా అధికార ప్రతినిధి యు జింగ్ మాట్లాడుతూ అన్ని అంశాలూ పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
అయితే ఈ ప్రాజెక్ట్ కారణంగా విపరీత పరిణామాలు తలెత్తుతాయని భారత్, బంగ్లాదేశ్ లు ఆందోళన చెందుతున్నాయి. ప్రాజెక్ట్ సైట్ భూకంపాలు తరచుగా సంభవించే టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులో ఉంది. ఈ పరిమాణంలో డ్యామ్‌ను నిర్మించడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుందని జలవనరుల నిపుణులు అంటున్నారు. వాస్తవానికి, టిబెట్‌లోని షిగాట్సే ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం, భారతదేశంలోని ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, పొరుగున ఉన్న నేపాల్, భూటాన్‌లలోని అనేక ప్రాంతాలలో భవనాలను కదిలించి, ప్రాణాలను బలిగొంది.
చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్‌తో సహా ప్రపంచంలోని ఏ ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కంటే కూడా ఇది పెద్దది. 2024 డిసెంబర్ 25న చైనా ప్రభుత్వం బ్రహ్మపుత్రకు టిబెటన్ పేరు అయిన యార్లంగ్ జాంగ్బ్ దిగువ ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 60,000 మెగావాట్ల ప్రాజెక్ట్ యాంగ్జీలో ఉత్పత్తి చేసే విద్యుత్ త్రీ గోర్జెస్ డ్యామ్ లో ఉత్పత్తి చేసేదాని కంటే మూడు రెట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రాజెక్ట్‌లో మొత్తం పెట్టుబడి ఒక ట్రిలియన్ యువాన్ ($137 బిలియన్లు) కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.
50కి.మీ పొడవుగా 2,000 మీటర్ల ఎత్తులో నిర్మించే ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు. జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి పర్వతాల గుండా సొరంగాలతో సహా భారీ నిర్మాణాలు నిర్మిస్తారు. ఈ ప్రదేశం భారత సరిహద్దుకు సమీపంలో ఉంది. ఆనకట్ట కట్టిన తర్వాత, చైనా నీటి ప్రవాహాన్ని నియంత్రించడమే కాదు, ప్రాజెక్ట్ పరిమాణం వల్ల ఒకే సారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల భారత్ కు తీవ్ర ప్రమాదం ఉంటుంది.