కరోనా వైరస్ పై అవాకులు చవాకులు పేలుతూ అమెరికా ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసేలా చేస్తున్నదని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యో తీవ్రంగా హెచ్చరించారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు చైనా అంతర్జాతీయ సమాజంతో సహకరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వైరస్ పైనా, హాంకాంగ్ లో చైనా తీసుకుంటున్న చర్యల పైనా తీవ్ర విమర్శలు చేస్తున్న అమెరికా తన హద్దులు దాటుతున్నదని ఆయన అన్నారు.
ప్రస్తుతం అమెరికా ‘‘రాజకీయ వైరస్’’ సోకి అల్లాడుతున్నదని అందుకే చైనా పై తరచూ మాటల యుద్ధం చేస్తున్నదని ఆయన అన్నారు. వారం రోజుల పాటు జరిగిన పార్లమెంటు సమావేశాలు పూర్తి అయిన సందర్భంలో వాంగ్ యో మీడియాతో మాట్లాడారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్యం, మానవ హక్కులు తదితర అంశాలపై గత కొద్ది కాలంగా సాగుతున్న మాటల యుద్ధం, కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో మరింత కనిష్ట స్థాయికి చేరాయి.