39.2 C
Hyderabad
April 25, 2024 16: 27 PM
Slider ముఖ్యంశాలు

ఏపిలో శాశ్వత మూత దిశగా సినిమా ధియేటర్లు

#boxoffice

క్రిస్ మస్, న్యూ ఇయర్, సంక్రాంతి…. సెలవులు. కరోనా తగ్గిపోతున్న వేళ…. ఇంకా ఒమైక్రాన్ విజృంభణ కాని వేళ… ధియేటర్ లో సినిమా చూద్దామనుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ లో అది వీలుకాకుండా చేస్తున్నారు అధికారులు. ఏదో ఒక సాకు చెప్పి సినిమా ధియేటర్లను మూసివేయిస్తున్నారు.

మరి కొన్ని చోట్ల ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ ధరలను చూసి వారంతట వారే స్వచ్ఛందంగా ధియేటర్లు మూసివేస్తున్నారు. ఇలా తూర్పు గోదావరి, అనంతపురం, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపుగా అన్ని సినిమా ధియేటర్లు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించడంతో సినిమా థియేటర్‌లను నడపడం తమ వల్ల కాదంటూ కొన్ని చోట్ల యజమానులే వాటిని స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు.

ముఖ్యంగా గ్రామ పంచాయతీల పరిధిలో నడిచే థియేటర్ల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ నుంచి బయటపడే తరుణంలో సర్కారు టికెట్ల ధరలు తగ్గించేయడంతో ఆర్థిక భారాన్ని మోయలేక… తూర్పుగోదావరి జిల్లాలో 45 మంది యజమానులు గురువారం థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ, కృష్ణా జిల్లా నందిగామ, మైలవరం, పెనుగంచిప్రోలు, శ్రీకాకుళం జిల్లా కొత్తూర్లలో తమ థియేటర్లకు యజమానులే స్వయంగా తాళాలు వేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరం, ధవళేశ్వరం… కాకినాడ గ్రామీణంలోని వాకలపూడి, జగ్గంపేట, రావులపాలెం, గోకవరం, అమలాపురం, రాయవరం, మలికిపురం, సీతానగరం, రాజోలు, కోరుకొండ, ఉప్పాడ, ముమ్మిడివరం, గొల్లప్రోలు తదితరచోట్ల సినిమా హాళ్లను యజమానులు మూసేస్తున్నారు.

పండగల వేళ ధరల తగ్గింపు పిడుగుసినీ పరిశ్రమకు పండగలు చాలా కీలకం. కొవిడ్‌ కారణంగా గతేడాది మార్చి/ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు/సెప్టెంబరు వరకు మూతపడిన థియేటర్లకు ఇటీవల అఖండ, పుష్ప చిత్రాలు ఊపిరులు ఊదాయి. అయితే ప్రభుత్వ తాజా జీఓ 35 ప్రకారం… గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ  థియేటర్లలో టికెట్ల ధరలు రూ.10, రూ.15, రూ.20… నాన్‌ ఏసీ థియేటర్లలో రూ 5, రూ.10, రూ.15… మున్సిపాలిటీల్లో రూ.30, రూ.50, రూ.70, కార్పొరేషన్‌ పరిధిలోని థియేటర్‌లలో రూ.40, రూ.60, రూ.100లకు విక్రయించాలి.

ఒక్కో థియేటర్‌ సామర్థ్యాన్ని అనుసరించి నిర్వహణ ఖర్చుల కింద నెలకు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యయమవుతోంది. ఒక్కో థియేటర్‌ను నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో తగ్గించిన ధరలతో వచ్చే ఆదాయం… నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోదని యజమానులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ కారణంగా ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల విద్యుత్తు బిల్లుల మాఫీ హామీ సైతం అమలుకు నోచుకోలేదని గుర్తుచేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో 11 థియేటర్ల సీజ్‌

చిత్తూరు జిల్లా కుప్పంలో 4, మదనపల్లిలో 7 థియేటర్లను అధికారులు సీజ్‌ చేశారు. బి.ఫారం రెన్యువల్‌ చేసి, అనుమతి పొందిన తర్వాత మాత్రమే తెరవాలని యజమానులకు సూచించారు. పలమనేరులోనూ తనిఖీలు జరిగాయి. వసతుల్లో లోపాలపై ప్రకాశం జిల్లాలో 28 థియేటర్ల యజమానులకు నోటీసులు జారీచేశారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, సత్తెనపల్లిలో, మంగళగిరిలోని థియేటర్లను అధికారుల బృందాలు పరిశీలించాయి.

గమనించిన లోపాలకు తగ్గట్లు నోటీసులు జారీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా గోరంట్లలో అనుమతుల రెన్యువల్‌ చేసుకోలేదని పలు థియేటర్లను మూసివేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ థియేటర్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోదాలు చేశారు. పలుచోట్ల అగ్నిమాపక సిబ్బంది కూడా తనిఖీలకు ఉపక్రమించారు. నెల్లూరు జిల్లా గూడూరులో నాలుగు, కోటలో రెండు, సూళ్లూరుపేటలో మూడు థియేటర్లలో తనిఖీలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో గురువారమూ తనిఖీల పర్వం కొనసాగింది. కృష్ణా జిల్లాలో బుధవారం అధికారులు సీజ్‌ చేసిన 12 థియేటర్ల పరిస్థితి గురువారం కూడా అలాగే ఉంది.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 28 థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో థియేటర్లకు సంబంధించిన అన్ని అనుమతి పత్రాలను చూపించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నడిపే పత్రిక రూ. 5.50కి అమ్ముతాడు కానీ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసే సినిమా ఆడే ధియేటర్ లో మాత్రం రూ.5 కే టిక్కెట్ అమ్మాలంటాడు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ శాశ్వతంగా మూతపడే స్థితికి వచ్చేసింది.

Related posts

నరసరావుపేట డిపో నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు

Satyam NEWS

ఏలూరులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన

Satyam NEWS

నెగ్లిజెన్సీ:పుట్టుకతోనే ముఖం ఫై కత్తిగాటుతో పుట్టేసింది

Satyam NEWS

Leave a Comment