37.2 C
Hyderabad
March 28, 2024 20: 44 PM
Slider సంపాదకీయం

క్లీన్ ఇట్: నేరమే రాజకీయం రాజకీయమే వ్యాపారం

supreme court

నేరస్తులు, ధనవంతులు, వ్యాపారస్తుల నుంచి రాజకీయాలు వేరు చేయడం సాధ్యమేనా? రాజకీయం ఒక ఖరీదైన వ్యాపారంగా మారిపోయి ఉన్న ఈ తరుణంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. అందుకు న్యాయ వ్యవస్థను మనస్ఫూర్తిగా అభినందించాలి.

న్యాయ వ్యవస్థ కు తోడుగా కేంద్ర ఎన్నికల సంఘం కనుక ఎవరి వత్తిడులకు లోనుకాకుండా సహకరిస్తే నూతన భారతం ఆవిష్కృతం అవుతుందనడంలో సందేహం లేదు. వ్యాపారస్తులను, నేరస్తులను రాజకీయాలలోకి రాకుండా అడ్డుకోవాల్సిన రాజకీయ పార్టీలు వారికే పెద్ద పీట వేస్తున్నాయి. డబ్బులు పంచడం, మద్యం సరఫరా చేయడం, పోలింగ్ బూత్ లను ఆక్రమించడం సామాన్యులు చేయలేరు కదా?

అందుకే గెలిచే అభ్యర్ధుల పేరుతో నేరస్తులను, ధనవంతులను పోగేసుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. నేరస్తులను గెలిపించుకునే ఈ రాజకీయ పార్టీలు ఏం సంస్కరణలు తీసుకురాగలుగుతాయి? అందుకే మేం నిజాయితీగా పాలిస్తున్నాం అని అధికార పార్టీలు చెబుతున్నా ఫలితం ఉండటం లేదు. ఉండదు కూడా. వ్యవస్థ భ్రష్టుపట్టి పోయి ఉన్నప్పుడు ఒకరో ఇద్దరో చేయగలిగింది ఏమీ ఉండదు.

చట్ట సభల్లో అందరూ నేరస్తులూ, ధనవంతులే ఉంటే చట్టాలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. నేరాలను సమర్ధించుకోవడం, ధనాన్ని కాపాడుకోవడం మరింత సంపాదించడం తప్ప ఈ నేరమయ రాకీయాలలో జరిగేదేం ఉండదు. కార్పొరేటర్లుగా గెలిచిన నేరస్తులు ఉన్నత స్థానాలకు వెళ్లడం చూస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యేగా, ఎంపిగా పదోన్నతులు పొందుతూ మరింతగా సంపాదించుకుంటున్నారు.

వారి వారి నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. నేరాలను అఫిడవిట్ లో పేర్కొనాలనే నిబంధన వచ్చిన తర్వాత అయినా సిగ్గు పడతారనుకుంటే ఈ రాజకీయ నాయకులు సిగ్గు పడటం లేదు. చేసిన నేరాలను వెబ్ సైట్ లలో ఉంచండి అంటే కూడా ఉంచుతారు. ఈ దేశంలో చాలా మంది పేపర్లు చదవరని, వెబ్సైట్లు చూడరని వారి గట్టి నమ్మకం.

చూసినా అందరూ నేరస్తులే ఉన్నప్పుడు చచ్చినట్లు తమలో ఒకరిని ఎన్నుకుంటారనే నమ్మకం. ప్రతి రోజూ నీతులు చెప్పే నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో కూడా 39 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. అంటే 22 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. ఇది ఎన్నికల సందర్భంగా వారు ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన అఫిడవిట్‌లో రికార్డు అయి ఉన్నాయి. ఇందులో 16 మంది మంత్రులపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి.

అంటే ఉగ్రవాదం, హత్య, అత్యాచారం, దోపిడీ, భూకబ్జా, మతకలహాలు, ఎన్నికల నియమాలు ఉల్లంఘన, కిడ్నాప్‌లాంటి సీరియస్ కేసులు ఉన్నాయి. ఆరుగురు మంత్రులు ప్రతాప్ చంద్ర సారంగి, బాబుల్ సుప్రియో, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషిలు తమపై కేసులు ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు.

ఇందులో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, మతకలహాల కేసు, జాత్యాంహకార కేసు, ఇతర కేసులు ఉన్నట్లు, కావాలనే గొడవలు సృష్టించడం, మతవిశ్వాసాలను కించపరచడం లాంటి కేసులు వీరిపై నమోదై ఉన్నాయి. ముగ్గురు మంత్రులు అశ్విని కుమార్ చౌబే, నితిన్ గడ్కరీ, గిరిరాజ్ సింగ్ లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు.

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ వీ మురళీధరన్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈయన మోడీ కేబినెట్‌లో విదేశీవ్యవహారాల సహాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయశాఖ బాధ్యతలు చేపట్టారు. చాలా రాష్ట్రాలలో మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆర్ధిక నేరాల అభియోగాలు ఉన్నాయి.

ఇలాంటి అన్ని కేసులలో వారికి శిక్ష పడకపోవచ్చు. అయితే కేసులు నడుస్తున్నాయంటే వారు అక్రమాలకు పాల్పడ్డట్టే కదా. ఇదే సందర్భంలో ఒక మేధావి టీవీ విశ్లేషణల్లో చెబుతున్నారు – ఏమని అంటే ప్రజలు నేరస్తుడు అని తెలిసి కూడా ఓట్లు వేసి గెలిపిస్తున్నారు అది తప్పు కదా అని. ప్రజలను తప్పుపట్టే పని చేసే ఈ మేధావులు ముందు రాజకీయ పార్టీలను సరిద్దడం నేర్చుకోవాలి. ప్రజలు గెలిపించినంత మాత్రాన నేరం కొట్టేయరు కదా? అందుకోసం ప్రజలను బాధ్యుల్ని చేయడం మాని రాజకీయ పార్టీను సరిదిద్దడం నేర్చుకోవాలి. ముందు ఈ మేధావులు మారాలి. వారి ఆలోచన మారాలి.

Related posts

ఎదురు చూసే రోజులకు నూకలు చెల్లాయి

Satyam NEWS

శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు ఆరంభం

Satyam NEWS

Tragedy: వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి కరోనా

Satyam NEWS

Leave a Comment