ప్రజల సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా కుప్పం సరికొత్త కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. దానిపేరే జన నాయకుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే అని సీఎం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సొంత నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండటం అసాధ్యం.
అయినప్పటికీ ఇప్పటికే చంద్రబాబు తనకున్న వ్యవస్థను ఉపయోగించి దృష్టికి తీసుకొచ్చిన వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపడం మనం ఇప్పటి వరకూ చూశాం. అయితే ఈ సారి మరో వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. ప్రజలు వచ్చి నేరుగా తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజానాయకుడు పేరుతో పార్టీ కార్యాలయంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీల స్టేటస్‌ను తన డ్యాష్ బోర్డులో కూడా చూసుకునేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇక వివరాల్లోకి వెళ్తే…..ఈ జన నాయకుడు కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కార్యాలయంలో నియమించారు.
తమ సమస్యలపై అర్జీలతో పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలను సాదరంగా సంబంధిత సిబ్బంది రిసీవ్ చేసుకుంటుంది. సమస్యలపై వచ్చారు కదా అని కసురుకోకుండా కూర్చోబెట్టి వారికి తాగడానికి ఓ కాఫీ లేదా టీ ఇచ్చి గౌరవంగా చూస్తారు. వచ్చిన వారిని వారి సమస్యను జననాయకుడు అనే అప్లికేషన్‌లో రాస్తారు. ఇక్కడ ఐదుగురు ఎంగేజ్మెంట్ అధికారులు ఉంటారు. వీరికిలో ఒక్కొకరికి ఆరు విభాగాలు కేటాయించారు. ఎంగేజ్మెంట్ ఆఫీసర్లు ప్రజల సమస్యను ఓపిగ్గా విని పోర్టల్‌లో పొందుపరుస్తారు.
ప్రభుత్వ ఉద్యోగులు పరిష్కరించదగిన సమస్యలైతే వాటిని PGRSకి పంపిస్తారు. పార్టీ తరపున చేయవలసిన పనులైతే వెంటనే పార్టీ నాయకత్వం దృష్టి సారించి చర్యలు తీసుకుంటుంది. సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో కూడా రసీదు కాపీపై బాధితులకు తెలియజేస్తారు. రసీదు ఇచ్చేశాం…మా పని అయిపోయిందన్నట్లు కాకుండా దీనికి మరో ప్రత్యేక టీం కూడా ఉంటుంది. అదే ఫాలోఅప్ టీం. ఈ ఫాలోఅప్ టీం సంబంధిత అధికారులను నిత్యం సంప్రదిస్తూ సమస్యను సకాలంలో పరిష్కరమయ్యేలా చూస్తారు.
నేరుగా ముఖ్యమంత్రి పరిశీలించేలా
ప్రతి అర్జీ, పరిష్కారం ఎంత వరకు వచ్చిందనేది నేరుగా సీఎం చూసేలా డాష్ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి సమస్యలు సత్వరం పరిష్కారం అవుతున్నాయా…లేదా అన్నదాన్ని సీఎం ప్రత్యక్షంగా చూడొచ్చు. నేరుగా అక్కడికి రాలేని వాళ్ల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
అదేవిధంగా జన నాయకుడుకు వచ్చిన సమస్యల పరిష్కారంపై కాల్ సెంటర్ నుంచి అర్జీదారులకు ఫోన్ చేసి వారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. సంతృప్తిగా ఉన్నారా…అసంతృప్తిగా ఉన్నారా…అసంతృప్తిగా ఉంటే దానికి గల కారణాలను తెలుసుకుంటారు. మీడియాలో వచ్చే ప్రజాసమస్యలను కూడా గుర్తించి సూమోటోగా జననాయకుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.