విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామిని ఎన్డీఏ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఇది సమిష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. ఏడు నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని, ఏపీకి అన్నీ మంచిరోజులేనని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖ స్టీల్ ప్రాంట్ కోసం విశాఖ నగర వాసులే కాకుండా ఎంతోమంది ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. తెలుగుజాతి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఏడు నెలలుగా అన్ని ప్రయత్నాలు చేశాము. 1996లో స్టీల్ ప్లాంట్ కు ఇబ్బందులు వస్తే నాటి ప్రధాని వాజ్ పేయితో మాట్లాడి రూ.1650 కోట్లు సాధించాము. స్టీల్ ప్లాంట్ కు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వమే.
అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నదీ తెలుగుదేశమే. గడిచిన ఐదేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్లక్ష్యం చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. ఇందుకోసం విశాఖ ఎంపీ భరత్ తనవంతు కృషి చేశారు. ఢిల్లీలో అనేక సమావేశాలు నిర్వహించాము. ఒకసారి ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాత్రి పన్నెండున్నరకు సమీక్ష చేశారు. పట్టుదలతో పనిచేశాం. చిత్తశుద్దితో ముందుకెళ్లాం. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు.
విశాఖ ప్రజల అభీష్టం, కార్మికుల శ్రమ ఫలించింది. నేను విశాఖలో పనిచేసే కార్మికులకు ఒకటే విన్నవిస్తున్నాను. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించడంలో మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యత తీసుకోవాలి. ఈ ఫ్యాక్టరీకి సమర్థవంతులైన సీఈవోను నియమిస్తాము. కావాల్సిన వనరులను సమీకరిస్తాం. స్టీల్ ప్లాంట్ కు 20 వేల ఎకరాల భూములున్నాయి. దేశంలో ఎక్కడా ఏ స్టీల్ ప్లాంట్ కు ఇంత విలువైన భూమి లేదు. అందరం కలిసి కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. నేను కూడా శ్రద్ధ పెడతాను. ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం మెచ్చుకొనేలా పనిచేద్దాము అని చంద్రబాబు అన్నారు.