అనంతపురం జిల్లా దిగువపల్లిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు దంపెట్ల నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలియగానే సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు.
కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు చేరుకుని నారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి కూడా ఉన్నారు.
నారాయణ మృతదేహానికి మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథ్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.