ఇంతకాలం నిప్పులు కురిపించిన ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరాల జల్లు కురిపించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్ వారికి కొండత భరోసా కల్పించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 97 డిపోల నుంచి దాదాపు 700 మంది ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు.
ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాలను రేపటిలోగా(డిసెంబర్ 2) చెల్లించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 52 రోజుల సమ్మె కాలానికి కార్మికులకు జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా డిపోల్లో మహిళల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆర్టీసీని లాభాల్లోకి తీసుకోస్తే సింగరేణి మాదిరిగా బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మహిళా ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం.. మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అలాగే మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపే డ్యూటీలు ఉండేలా చూడాలన్నారు. మహిళా కార్మికుల ప్రసూతి సెలవులను పెంచాలని నిర్ణయించారు.
ప్రయాణికులు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. ఇకపై కండక్టర్‌లపై కాకుండా వారిపైనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం కార్మికులు కష్టించి పనిచేయాలని సూచించారు.
ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. ఒక్క రూట్‌లో కూడా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని.. ప్రతి ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ భేటీలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.