ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికారులు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించి వచ్చిన ఆయన ఆర్టీసీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలో పదివేల బస్సులు నడుస్తున్నాయని, ఇందులో 2100 బస్సులు ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. మరో ఐదు వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా చేయడానికి ముందుకు వచ్చారన్నారు. దీంతో 7వేలకు పైగా బస్సులు నడపడం సాధ్యమతుందని చెప్పారు. ఆర్టీసీలో మైలేజ్ అయిపోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దె బస్సులు తీసుకోవాలని, శనివారమే ఇందుకోసమే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికిప్పుడు ప్రజల అసౌకర్యాన్ని వీలయినంత తగ్గించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు తెప్పించాలని, రాష్ట్రంలోని ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేషన్లపై కాస్త ఉదారంగా ఉండాలని చెప్పారు. ప్రైవేటు వాహనాలకిచ్చే పర్మిట్ రుసుంలో 25 శాతం రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. సరిహద్దులో ఉన్న జిల్లాలకు దాని సరిహద్దులో ఉన్న రాష్ట్రాల నుంచి ప్రైవేటు బస్సులను తెప్పించాలని ఆదేశించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు తగిన భద్రత కల్పించాలని డిజిపిని సిఎం ఆదేశించారు. బస్సు డిపోల వద్ద భద్రత కల్పించాలని, బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సిఎం కోరారు
previous post
next post