40.2 C
Hyderabad
April 19, 2024 18: 09 PM
Slider ముఖ్యంశాలు

పేద ప్రజల బాధలు తీరేది ఇలాగేనా సీఎం గారూ..?

#arunatara

ధరణి వస్తే పేద ప్రజల బాధలు తీరుతాయని సీఎం కేసీఆర్ చెప్పారని, పేద ప్రజల బాధలు తీరేది ఇలాగేనా సీఎం గారు అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార ప్రశ్నించారు. బాధలు తీరడం దేవుడెరుగు.. ఇంకా బాధలు ఎక్కువయ్యాయని, ఫలితంగా రైతులు ఆత్మహత్యలు బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేపట్టిన ధరణితో రైతుల గోస పేరుతో చేపట్టిన నిరాహార దీక్షను ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ధరణి వస్తే పేద ప్రజల బాధలు తీరుతాయని సీఎం కేసీఆర్ చెప్పారని,  బాధలు తీరకపోగా ఇంకా ఎక్కువయ్యాయన్నారు.

రెండున్నర సంవత్సరాలుగా ధరణి పోర్టల్ తో రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని తెలిపారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం రమణారెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతుగా తాము కూడా అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో ఆందోళనకు కూర్చుంటామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ బాగోగులు మాత్రమే చూసుకోవడం కాదని, రైతుల సమస్యలు పట్టించుకోవాలన్నారు.

రేపటినుంచే ఆమరణ దీక్ష: వెంకట రమణారెడ్డి

ధరణి సమస్యలను పరిష్కరించాలని మూడు రోజులు నిరసన దీక్షలు, మూడు రోజులు నిరాహార దీక్షలు చేపట్టినా అధికారుల నుంచి స్పందన లేదని, రేపటి నుంచి రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేదాక ఆమరణ దీక్ష చేపడుతున్నానని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు. ధరణి సమస్యలపై ఒక్కొక్క తహసీల్దార్ వద్ద వెయ్యి నుంచి 2 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు.

టీఎం 33 లో వెయ్యి రూపాయలు చెల్లించి చేసిన దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, వీటి ద్వారా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరిందన్నారు. ఈ దరఖాస్తులను రిజెక్ట్ చేయడంతో ఒక్కొక్కరు రెండు మూడు సార్లు దరఖాస్తు చేసుకుంటున్నారని, తద్వారా ప్రభుత్వానికి 2 వేల నుంచి 2500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.

మాచారెడ్డి మండలం భవానిపేట శివారులో 769 సర్వే నంబరులో 625 ఎకరాల భూమిని ధరణిలో 930 ఎకరాలకు మార్చారని, ఎక్కువగా చేర్చిన 300 ఎకరాలకు అధికార పార్టీ నాయకులు రైతుబంధు పొందుతున్నారని ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేలు, మంత్రి చక్రబంధంలో జిల్లా కలెక్టర్ ఉన్నారని ఎద్దేవా చేశారు.

అటవీశాఖ భూములను రెవిన్యూ భూములుగా మార్చిన ఘనులు రెవిన్యూ అధికారులని, మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారం ఇలాకాలో పట్టాలు మార్చిన ఆధారాలు తనవద్ద ఉన్నాయన్నారు. రేపటి నుంచి రైతు సమస్యలపై ఆమరణ దీక్ష చేపడుతున్నానని, పోలీసులు దిగ్బంధం చేస్తే గ్రామాల్లో ఆందోళనలు చేస్తామన్నారు. సమస్యలు పరిష్కారం అయితే ఇంటికి లేకపోతే కాటికి వెళ్ళడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు.

Related posts

నిర్బంధ అరెస్టులు కొత్తేమి కాదు

Bhavani

గన్ షో:భార్య కాపురానికి రావట్లేదని తుపాకీతో కాల్చి

Satyam NEWS

కడప ఎంపి వైఎస్ అవినాష్ కు కరోనా పాజిటివ్

Satyam NEWS

Leave a Comment