హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షం, ఈదురు గాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రోడ్ల పై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్య, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, విభాగాలు సమన్వయం తో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని ఆదేశించారు. జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.