26.9 C
Hyderabad
January 16, 2021 21: 06 PM
Slider సంపాదకీయం

స్థానిక ఎన్నికల చక్రబంధంలో ఇరుక్కున్న ఏపి సిఎం

#Dr.N.RameshkumarIAS

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇరుకున పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసే వరకూ ఎట్టిపరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపరాదని మంకుపట్టుతో ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

తాను తీసేసిన డాక్టర్ రమేష్ కుమార్ కోర్టు ఆదేశాలతో తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులు కావడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే అధికార పార్టీలో బాధ్యులతో ఆయన పదే పదే ఎన్నికల కమిషనర్ ను చిన్న చూపు చూసే విధంగా మాట్లాడిస్తున్నారు.

అయితే ఎన్నికల కమిషనర్ రాజ్యాంగపరంగా తనకు సంక్రమించిన అధికారాల మేరకు తన విచక్షణతో ముందుకు వెళుతున్నారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించడం నుంచి కోర్టు ఆదేశాలతో చేస్తున్న డాక్టర్ రమేష్ కుమార్ నేడు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలవడం వరకూ అన్నీ పద్ధతి ప్రకారం నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన ఎంపిటిసి, జెడ్ పి టి సి ఎన్నికలను కొనసాగించడం కాకుండా గ్రామ పంచాయితీ ఎన్నికల ప్రక్రియను ఆయన చేపట్టేందుకు ఉద్యుక్తులు కావడం ఇక్కడ గమనార్హం. ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం అంచనా వేయలేదు.

ఎంపిటిసి, జెడ్ పి టి సి ఎన్నికలను ముందుగా కొనసాగిస్తారని దీన్ని తాము అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తుండగా ఎన్నికల కమీషనర్ అనూహ్యంగా గ్రామ పంచాయితీ ఎన్నికలను తెరపైకి తెచ్చారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి.

కరోనా కట్టడిలో వైఫల్యతను ఒప్పుకున్న ప్రభుత్వం

దీనికి ఎవరి నుంచి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు రాష్ట్రంలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో సమర్ధంగా వ్యవహరించిందని, కరోనాను అదుపు చేసిందని డాక్టర్ రమేష్ కుమార్ అధికారికంగా చెబుతున్నారు.

అయితే తాము కరోనాను అదుపు చేయలేకపోయామని, తాము కరోనా కట్టడి విషయంలో విఫలమయ్యామని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషిస్తున్నవారు అంటున్నారు.

కరోనా కట్టడి చేసినట్లు, దేశంలోనే విశిష్టమైన ఆరోగ్య యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని, వరల్డ్ క్లాస్ మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశామని ఇంతకాలం చెప్పిన వారే ఇప్పుడు కరోనా విషయంలో విఫలమయ్యామని చెప్పడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం తన విధి నిర్వహణను అడ్డుకుంటున్నదని ఇప్పటికే ఎన్నికల కమిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు నిధుల విడుదల తదితర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి వచ్చింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ అడ్డుపడ్డారు.

చీఫ్ సెక్రటరీ లేఖ ఎన్నికల కమిషనర్ కు కలిసివచ్చే అంశం

ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లిఖితపూర్వకంగా చెప్పడం ఎన్నికల కమిషనర్ కు న్యాయ పోరాటంలో కలిసి వచ్చే అంశం. రాష్ట్ర ప్రభుత్వం తనను అడ్డుకుంటున్నదని చెప్పడానికి దీన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆయన ఎంత సహాయ నిరాకరణ చేసినా ఫలితం ఉండకపోవచ్చునని న్యాయనిపుణుల అభిప్రాయం. వాటన్నింటిని అధిగమించి డాక్టర్ రమేష్ కుమార్ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించకుండా ఎలా చేయాలా అని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నది.

Related posts

వలస కూలీల ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

కల్వకుర్తి పట్టణమంతా డ్రోన్ కెమెరా తో నిఘా

Satyam NEWS

ఆరేళ్ల సినీ కెరియర్ లో అన్నీ ఆణిముత్యాలే

Satyam NEWS

Leave a Comment