27.7 C
Hyderabad
April 25, 2024 09: 47 AM
Slider పశ్చిమగోదావరి

గిట్టుబాటు ధర కోసం కోకూ రైతుల రాస్తారోకో

#co co farmers protest

కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించి తక్షణం కొనుగోలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం కో-కో రైతులు రోడ్డెక్కారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం, విజయరాయి ఉద్యాన పరిశోధనా కేంద్రం వద్ద రోడ్డుపై కోకో కాయలు,గింజలు రోడ్డుపై పారబోసి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.

ఇళ్ళ వద్దనే ఉన్న కోకో గింజలను ఏమి చేయాలంటూ నినాదాలు  చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కో-కో గింజలను రైతుల నుండి తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పండించిన పంటను ఇళ్ళ దగ్గరే దాచుకోవాల్సి వస్తోందని,పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 50వేల ఎకరాలకు పైగా కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటగా కో-కోను రైతులు సాగు చేస్తున్నారని అన్నారు.

కోకో గింజలు కోనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను దోచేస్తున్నారని విమర్శించారు. కరోనా విపత్తు లాక్ డౌన్ కారణం చెప్పి ఎగుమతులు లేవంటూ కో-కో గింజలు కొనుగోలు చేయడం లేదని, కొద్దిగా కొన్నా ధర తగ్గించివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎకరాకు 2నుండి3 క్వింటాళ్ళ దిగుబడి వస్తోందని, పెట్టుబడి రూ35వేలు నుండి రూ.40వేలు వరకు అయిందని వివరించారు. పంట అమ్ముడుపోక ఆదాయం లేక అప్పులు తీర్చే మార్గం లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ప్రారంభంలో కిలోకు రూ.190లు ఇచ్చిన కంపెనీలు రూ.165లకు ధర తగ్గించివేశారన్నారు.

తగ్గిన ధరతో ఎకరాకు రు.10వేలకు పైగా రైతులు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని,కిలో కోకో గింజలకు రూ.200లు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కో-కో రైతుసంఘం నాయకులు గుదిబండ రమేష్ రెడ్డి, పి.అచ్యుతరామయ్య మాట్లాడుతూ కో-కో కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి ధర తగ్గించి వేసి రైతులకు నష్టం కలిగిస్తున్నాయని చెప్పారు. నష్టపోతున్న కో-కో రైతులను ఆదుకోవాలని కోరారు.

అధికారులు,ప్రభుత్వం వెంటనే స్పందించి కంపెనీల ప్రతినిధులు, రైతులు, రైతుసంఘాలతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి కో-కో గింజలు కిలోకు రైతుకు రూ.200లు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గుదిబండి వీరారెడ్డి, కొఠారు రామారావు, ఎం.వెకటేశ్వరరావు, విజయలక్ష్మి, పాకలపాటి వెంకటేశ్వరరావు, జి.సుబ్బారెడ్డి, కె.అద్భుత్, యు.మాధవరావు, పి.నరేంద్రరెడ్డి పలువురు కో-కో రైతులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

Satyam NEWS

ఓట్లేసిన దళితులపైనే దాడులు చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

కొత్త చట్టం లో శిక్షలు తప్పవు …మైనర్లను రేప్ చేస్తే ఇక ఉరే

Bhavani

Leave a Comment