వి.జి. సిద్ధార్థ…ప్రభావశీల వ్యాపారవేత్త, వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆలోచనాపరుడు, దక్షిణాది కాఫీకి బ్రాండ్ అంబాసిడర్… ఈ విషయాల్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వేరే అభిప్రాయం ఉండే అవకాశం కూడా లేదు. ఆయన అర్ధంతర మహాభినిష్క్రమణం బాధ కలిగించే విషయమే. ఆయన కడసారిగా రాసినట్లు చెబుతున్న లేఖపై విచారణ జరుపుతున్నారు. అందులో పేర్కొన్న అంశాలను ఇప్పటికే నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానిజాలు పూర్తిగా వెల్లడికాకముందే మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు సిద్ధార్ధ ఆత్మహత్యను ట్యాక్స్ టెర్రర్ గా అభివర్ణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ముడిపెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. ఆఖరికి విజయ్ మాల్యా కూడా తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని చెబుతున్నాడు.
విజయ్ మాల్యా ఆత్మహత్య చేసుకోలేదు కదా
ట్యాక్స్ టెర్రర్ ఉంటే, సిద్ధార్ధ్ కు ఎదురైన అనుభవమే కలిగితే విజయ్ మాల్యా ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు? టాక్స్ టెర్రర్ అంటూ దేశంలోని కార్పేరేట్ కంపెనీలు ఒక పదాన్ని పుట్టించి దాన్నించి తమ పాపాలను కడిగేసుకోవాలని, దాన్నించి తమ అక్రమాలు దాచిపెట్టుకోవాలని చూస్తున్నాయి. దేశంలోని దాదాపు అన్ని మీడియా సంస్థలూ కూడా అదే కార్పొరేట్ల అక్రమ సంతానమే కావడం వల్ల అదే పదాన్ని వల్లెవేస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీల చందాలపై ఆధారపడి బతికే రాజకీయ నాయకులు ట్యాక్స్ టెర్రర్ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయి. సిద్ధార్ధ్ తాను తీసుకున్న రుణాలకు సంబంధించి, ఆర్జించిన లాభాలకు సంబంధించి దాదాపు రూ.300 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలి. అయితే ఆయన చెల్లించింది కేవలం రూ.46 కోట్లు. మరి ఆదాయపు పన్ను విభాగం మిగిలింది చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేయదా? అది వారి డ్యూటీ కాదా?
ఆదాయపు పన్ను అధికారులు అడిగితే సమాధానం చెప్పాలి కదా
ఇలా ఆదాయపు పన్ను నోటీసు రాగానే ఆత్మహత్యలు చేసుకునే పద్ధతే ఉంటే ఈ దేశంలో పది లక్షల రూపాయల ఆదాయం ఉండి ఏ కారణం వల్లనైనా రిటర్న దాఖలు చేయలేక పోయి ఆదాయపు పన్ను నోటీసు అందుకున్న వారంతా ఆత్మహత్యలు చేసుకునేవారే కదా? సిద్ధార్ధ మరణం అతని మానసిక పరిస్థితి వల్ల జరిగిందే కానీ (ఆత్మహత్య అయితే… హత్య అయితే దానికి కారణాలు వేరే ఉంటాయి) అప్పుల వాళ్లు, ఆదాయపు పన్నుల వాళ్లు వత్తిడి తెచ్చారంటే ఎలా? దీంతో ఐటీ శాఖ స్పందించింది. తాము సిద్ధార్థను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని, ఆయన విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరించామని ఆదాయపు పన్ను అధికారులు అంటున్నారు. మైండ్ ట్రీలో వాటాల విక్రయం ద్వారా సిద్ధార్థ రూ. 3,200 కోట్లు పొందారని, దీనికి రూ. 300 కోట్లు పన్ను చెల్లించాల్సి ఉండగా రూ. 46 కోట్లే చెల్లించారని ఐటీ అధికారులు వెల్లడించారు. ఇంత కట్టాల్సిన అవసరం లేకపోతే సంబంధిత ఉన్నతాధికారుల వద్ద మళ్లీ మదింపు చేసుకోవచ్చు. సిద్ధార్ధ్ చనిపోయినందుకు ఆదాయపు పన్ను శాఖను నిందించడం వల్ల ప్రయోజనం లేదు.
సిద్ధార్ధ్ రాసిన ఆఖరు లేఖ నకిలీదా
సిద్ధార్థ పేరుతో విడుదలైన లేఖలో ఆయన సంతకం తమ రికార్డుల్లోని సంతకంతో సరిపోవడం లేదని ఐటీ అధికారులు తెలిపారు. ముందు ఆ విషయంపై విచారణ జరపాలి. సిద్ధార్థ కుటుంబానికి కాఫీడే ఎంటర్‌ప్రైజెస్(సీడీఈ)లో 53.43శాతం వాటా ఉంది. దీనిలో 75శాతం వాటాలు ఇప్పటికే తాకట్టులో ఉన్నాయి. వ్యక్తిగతంగా సిద్ధార్థకు సీడీఈలో 32.75శాతం వాటా ఉంది. వీటిల్లో కూడా 70శాతం వాటాలు తాకట్టులోనే ఉన్నాయి. మే3 వ తేదీ నాటికి మైండ్‌ట్రీలో సీడీఈకి ఉన్న వాటాలను విక్రయం పూర్తిచేశారు. ఫలితంగా మొత్తం చెల్లింపులు పోను చేతికి రూ.2,100 కోట్లు వచ్చాయి. దీనిపై ఒక సందర్భంలో సిద్ధార్థ మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా ఉన్న రూ.600 కోట్ల అప్పును, సీడీఈ రుణాలను ఈ సొమ్ముతో తీర్చేసినట్లు మే 24 వెల్లడించారు. దీంతోపాటు మైండ్‌ట్రీలో వ్యక్తిగత హోదాలో 3.33శాతం వాటాలను కొనసాగిస్తున్నట్లు గతంలోనే ఆయన ప్రకటించారు. మార్చిలో సీడీఈలో ప్రమోటర్ల వాటా విలువ రూ.3,500 కోట్లుగా ఉంది. ఈ విలువ జూన్‌లో మైండ్‌ట్రీ అమ్మకం పూర్తైన తర్వాత రూ.2,600 కోట్లకు చేరింది.
షేర్లు పతనం అవుతూనే ఉన్నాయి
మార్చి18న మైండ్‌ట్రీలో వాటాల విక్రయాన్ని ప్రకటించడంతో షేర్ రేటు రూ.309కి చేరింది. కానీ తర్వాత కంపెనీ షేర్లు క్రమంగా పడిపోవడం ప్రారంభమైంది. ఫలితంగా రుణం కోసం ఇచ్చే తాకట్టు ఆస్తి విలువను సమానం చేయడం కోసం అదనపు షేర్లుగానీ, ఇతర ఆస్తులు కానీ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవన్నీ కొత్తగా తెలుసుకునే వారికి నిజమా అనిపించవచ్చు. అయితే అదే బిజినెస్ లో మరీ ముఖ్యంగా షేర్ ట్రేడింగ్ తోనే కెరియర్ ను ప్రారంభించిన సిద్ధార్ధ్ కు కొత్త కాదు. ఒక ప్రముఖ కంపెనీ వద్ద 1200 కోట్ల రూపాయల రుణం కోసం ఆయన ప్రయత్నించారని, ఆ రుణం వచ్చి ఉన్నా కూడా సిద్ధార్ధ్ బతికి ఉండేవారని మరో వాదన వినిపిస్తున్నారు. కంపెనీ విలువ తరిగిపోతున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంటే ఏ ఆర్ధిక సంస్థ అయినా రుణం ఇస్తుందా?
తాజా రుణం రాకపోవడానికీ కేంద్ర ప్రభుత్వమే కారణం అంటే ఎలా
ఇలా ఆ ఆర్ధిక సంస్థ రుణం ఇవ్వకపోవడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని మరో అభాండం మోపుతున్నారు. ఇలాంటి వాదనలు వినిపించడం ఎంత వరకు సబబు? జులై 3వ తేదీన మేబ్యాంక్ కిమ్ ఇంజ్ బ్రోకరేజి సంస్థ లెక్కల ప్రకారం మార్చి 2018నాటికి సీడీఈకి రూ.2,323 కోట్ల అప్పు ఉంది. ఇది మార్చి 2019 నాటికి రూ.4,068కోట్లకు చేరింది. సీడీఈ ఒక పబ్లిక్ ఆఫర్ ద్వారా 2015లో రూ.1,000 కోట్లు సమీకరించింది. అప్పట్లో డెట్ టు ఈక్విటీ నిష్పత్తిని 1.7రెట్లుగా చూపించగా ఇది 2019 నాటికి 2.6రెట్లకు చేరింది. దీనికి తోడు కంపెనీ మొత్తం ఆస్తులు అమ్మితే వచ్చే సొమ్ము అప్పుల చెల్లింపులకే సరిపోయే స్థితికి చేరింది. వాస్తవం ఇది కాగా వేరు కారణాలు చూపించడం భావ్యం కాదు. అతి చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి వచ్చిన సిద్ధార్ధ్ కు కష్ట నష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. అందుకు వారి కుటుంబం సహకరించి ఉండాలి.
సిద్ధార్ధ్ ప్రవర్తనపై అనుమానం లేదు
సిద్ధార్ధ్ ఆ రోజు బయటకు వెళ్లే ముందు కూడా బాగానే ఉన్నాడని ఆయన భార్య చెబుతున్నది. మరి అంత నిబ్బరంగా ఉన్న ఆయన అకస్మాత్తుగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు???? అసలు విషయం ఆయన కుటుంబ సభ్యుల నుంచి రాబట్టాల్సి ఉంటుంది. కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఇప్పటికే నిపుణులు బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల చెల్లించాల్సిన అప్పులను లెక్క తీసి క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తామనే భరోసా ఇవ్వాలి. వ్యాపారాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ప్రయత్నం చేయాలి. సిద్ధార్ధ్ నిర్మించిన సామ్రాజ్యం అంత తేలికగా పడిపోదు. ఈ ధైర్యంతో అడుగు ముందుకు వేయాలి. కంపెనీకి అంకిత భావంతో పని చేసే సిబ్బంది ఉన్నారు. వారే ఇప్పుడు కంపెనీకి మూలధనం.