23.7 C
Hyderabad
August 10, 2020 04: 10 AM
Slider కృష్ణ

ఏపీలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

#Communist Party

ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవలు అస్తవ్యస్తంగా మారాయని, కరోనా రోగులకు సరిపడా బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కరోనా విపత్తుపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు డిమాండు చేశారు.

కరోనా విజృంభణ నేపధ్యంలో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని, నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్ష పార్టీల నేతలు సోమవారం నిరసనకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా విజయవాడ దాసరి భవన్ లో వామపక్ష పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేసి కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

కరోనాను గాలికి వదిలేసిన మోడీ

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ కరోనా ప్రారంభ దశలో కరోనా నియంత్రణకు ప్రధాని మోడీ చురుగ్గా వ్యవహరించారని, ఆ సమయంలో ప్రజలు స్వచ్చందంగా సహకరించారని గుర్తు చేశారు. నేడు కరోనాను మోడీ గాలికొదిలేశారని, రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో అంతుపట్టడం లేదని విమర్శించారు. కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే కార్యక్రమాల పైనే ఆయన దృష్టి కేంద్రీకరించారన్నారు.

150 కోట్ల ప్రజలకు ప్రధానిగా ఉన్న మోడి ప్రజల ప్రాణాలకంటే ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూలదోసే పనిలో నిమగ్నమయ్యాడరన్నారు. ఇటు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కరోనా పై మొదటి నుంచి తేలిగ్గా తీసుకుని పారాసిటమల్ తోనూ, బ్లీచింగుతోనూ కరోనాను పారదోలవచ్చని పలు వ్యాఖ్యలు చేశారన్నారు.

ఏపిలో వైద్య సేవలు అధ్వాహ్నం

ఆ తరువాత కరోనాతో సహజీవనం చేయడం తప్పనిసరని, ఇప్పుడు కరోనా అందరికీ వస్తుందని చెబుతున్నారని మండిపడ్డారు. కరోనా నియంత్రణపై జగన్ ఇస్తున్న ప్రకటనలు చూస్తుంటే వైద్య సేవలు బ్రహ్మాండంగా జరగాల్సి ఉందని, ఆచరణలో ఎక్కడా జరగడం లేదన్నారు.

కరోనా రోగులకు భోజనం కోసం రోజుకు రూ. 500 కేటాయిస్తే వారికి నాసిరకం భోజనం ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 1041 మంది మృతి చెందారని, రోజు రోజుకు మృతుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

పక్క రాష్ట్రాలకు పరుగులు ఎందుకు

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా రోగులు ఎంత మందికి వైద్యం అందించారో ప్రభుత్వం వివరాలు వెల్లడించాలని డిమాండు చేశారు. నిజంగా ఎపీలో అంత వైద్య సేవలు అందుతుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభణతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారన్నారు. కరోనా ఆసుపత్రుల్లో రోగుల కోసం ఏర్పాటు చేసిన బెడ్ల కంటే రోగులు అత్యధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనికి నిదర్శనంగా నెల్లూరు కరోనా ఆసుపత్రిలో 300 బెడ్లకు గాను 600 మంది రోగులున్నారని తెలిపారు.

ఎవరు బతికారో ఎవరు పోయారో కూడా తెలియడం లేదు

ఎస్ఆర్ఐ ఆసుపత్రిలో 200 బెడ్లకు గాను 700 రోగులున్నారని, విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోనూ ఇదే పరిస్థితి దాపురించిందని వివరించారు. ఎవరు బతికారో, ఎవరు చనిపోయారో తెలియని దుస్థితి నెలకొందన్నారు. 100 పేషంట్లకు ముగ్గురు నర్సులు సేవలందిస్తున్నారని, చనిపోయిన పేషంట్లను సైతం నర్సులే తరలించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

 సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి. ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలపై చూపుతున్న శ్రద్ధ కరోనా నియంత్రణలో చూపడం లేదన్నారు. కరోనా సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం కోసం దర్శనాలకు అనుమతించడం తగదన్నారు. ప్రజారోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి

కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మెరుగైన వైద్య సేవలందించాలని, లేకుంటే 10 వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు సుందరరామరాజు మాట్లాడుతూ కరోనా ఉధృతి క్రమేపీ పెరుగుతున్న రీత్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సేవలందించేందుకు ఉపక్రమించాలని డిమాండు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు ఖాదర్ బాష మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనాతో పాటు అంటువ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆసుపత్రుల్లో సరైన బెడ్లు లేనందున కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మెరుగైన సేవలందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కరోనాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి

ఎసీయూసీఐ రాష్ట్ర నాయకులు కె.సుధీర్ మాట్లాడుతూ ప్రజలకు తగినంత బడ్జెట్ కేటాయించి కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రైవేటు వైద్య శాలల్లో కరోనా సేవల అనుమతికి ఆదేశించాలన్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచి కరోనా నివారణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ఇన్సాఫ్ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ అఫ్సర్, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్రమాలను ప్రశ్నించినందుకే రేవంత్ రెడ్డి అరెస్టు

Satyam NEWS

తక్కువ స్థాయిలో జ్వరం వస్తే భయపడవద్దు

Satyam NEWS

ఎలర్ట్: నేటి అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!