గత కొంతకాలంగా దినపత్రిక విలువలు దిగజరుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకు బలం చేకూరుస్తూ కొందరు విలేఖరుల పేరిట చేస్తున్న అక్రమాలు, బెదిరింపులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గతంలో కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన కొందరు విలేఖరులు ఓ వ్యక్తితో కలిసి బిల్డర్లను, నిర్మాణదారులను బెదిరించిన విషయం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజాగా పేరున్న పేపర్ లో పనిచేస్తున్న కూకట్ పల్లికి చెందిన ఓ విలేకరి తనను బెదిరిస్తున్నాడని, ఆయన వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని పేర్కొంటూ ఓ బిల్డర్ ఇటీవల కూకట్ పల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద నగర్ లో నివాసం ఉండే ఉప్పాల ఉమాశంకర్ వృత్తిరీత్యా బిల్డర్ గా పలు నిర్మాణాలను చేపడుతుంటాడు. 2022 సంవత్సరంలో వివేకానంద నగర్ కాలనీలోని ప్లాట్ నెంబర్ 18,29, 20లలో ఉన్న పాత బిల్డింగ్ ను కూల్చి కొత్త బిల్డింగ్ కట్టేందుకు దివ్యశ్రీ అపార్ట్మెంట్ ఓనర్స్ అయిన 17 మంది నుండి 13.07.222న అగ్రిమెంట్ చేసుకున్నారు. 17 మందిలో ఒకరైన కె. అనురాధ భర్త అయిన కొనకంచి కృష్ణ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూకట్పల్లి విలేకరిగా పనిచేస్తున్నాడు.
తాను చేపట్టే నిర్మాణములో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని, తనకు ప్లాట్ నెంబర్ 601ని సగం ధరకు ఇవ్వాలని ఉమాశంకర్ ను కోరగా అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారు. అయితే నాటి నుండి చెల్లించాల్సిన సగం ధర కూడా చెల్లించక పోగా బిల్డర్ ఉమాశంకర్ ను మానసికంగా ఇబ్బందులు పెడుతూ తనకు ప్లాట్ డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడని, బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాశాడు.
నిర్మాణంలో ఉన్న తన బిల్డింగ్ లను జీహెచ్ఎంసీ వాళ్లతో కూలగొట్టిస్తానని బెదిరిస్తూ, మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ తనను వేధిస్తున్నాడని, రిపోర్టర్ కృష్ణ నుండి తనకు ప్రాణభయం ఉన్నదని, భౌతిక దాడులు చేసే ప్రమాదం ఉన్నదని, అతని నుండి తనకు, తన కుటుంబానికి ప్రాణభయం ఉన్నదని, అతని నుండి తనను తన కుటుంబాన్ని రక్షించాలని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుపై (FIR no: 883/2024) కేసు నమోదు చేసిన కూకట్ పల్లి పోలీసులు విచారణ చేపట్టారు.