వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చెప్పారు. ప్రతి దాంట్లో కలుగజేసుకొని తప్పు చేసిన వారికి కొమ్ము కాస్తూ బాధితులకు నరకం చూపిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర డీజీపీకి ఎస్సై చిట్టా మొత్తం తీసుకెళ్లి ఆయనపై చర్యలు తీసుకునేదాకా తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నం. 455, 456 లలో కొందరు బీసీలు ప్లాట్లు కొని హద్దు రాళ్లు పాతుకుంటే పెబ్బేరు పట్ణణానికి చెందిన ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు (సెక్రటేరియట్లో హోం శాఖ విభాగంలో ఉద్యోగి) వాటిని పీకేసి ప్లాట్ల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాచాల చెప్పారు. ఆ ఇద్దరు రాళ్లు పీకేసిందే కాకుండా ఉల్టా ప్లాట్ల యజమానుల మీద పెబ్బేరులో క్రిమినల్ కేసులు పెట్టించారని ఆయన తెలిపారు.
రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ చెలిమిల్ల గౌడ కులస్థులు గ్రామంలో ఉన్న 6 గురు లైసెన్సుదారులు తమను కల్లు అమ్మనివ్వడంలేదని దీని శాశ్వత పరిష్కానికి కృషి చేయాలని కోరారు. చెలిమిల్ల కల్లు మాముల పంచాయతీలో రాష్ట్ర కేబినెట్ పదవిలో ఉన్న ఒక నాయకుడు జోక్యం చేసుకున్నారని, కొన్నేళ్లుగా గౌడ కులస్థులు కల్లు అమ్ముకోకుండా జీవనాధారం కోల్పోతుంటే ఆయన మధ్యలో వచ్చి సమస్య పరిష్కారం కకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని చెప్పారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్, మాజీ సర్పంచ్ అక్కి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ రాచాలకు మద్దతు తెలిపి సన్మానించి, సర్వాయి పాపన్న చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, నాయకులు రాఘవేందర్ గౌడ్, నరసింహ యాదవ్, అంజన్న యాదవ్, మహిందర్ నాయుడు,దేవర శివ,నాగరాజు యాదవ్, తెలుగు నాగరాజు, సురేందర్, మ్యాదరి రాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, నాగరాజు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్