27.7 C
Hyderabad
April 26, 2024 04: 01 AM
Slider సంపాదకీయం

ఎవరు అడ్డుపడ్డా అడ్డంకులు దాటి…..

#JusticeNVRamana

ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా జస్టిస్ ఎన్ వి రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఎన్ వి రమణ చీఫ్ జస్టిస్ అవుతారని చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆయనే సీనియర్. అలాంటి వ్యక్తి చీఫ్ జస్టిస్ కావడం సాధారణంగా జరిగే పని.

అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధారణంగా జరగాల్సిన ఆ పనిని సంక్లిష్టం చేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. జస్టిస్ ఎన్ వి రమణ కుటుంబంపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు.

లేఖ రాయడమే కాకుండా దాన్ని ప్రజలకు బహిర్గత పరిచారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తించడం కేవలం జస్టిస్ ఎన్ వి రమణ చీఫ్ జస్టిస్ కాకుండా అడ్డుకోవడానికే అనేది నిర్వివాదాంశం. సుప్రీంకోర్టు అంతర్గతంగా విచారణ చేపట్టి ఈ లేఖ కు ముగింపు పలికింది. జస్టిస్ ఎన్ వి రమణకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక తెలుగు వాడు చీఫ్ జస్టిస్ అవుతుంటే తెలుగు వారంతా సంతోషించాలి.

అయితే ఇక్కడ అలా జరగలేదు. కేవలం కులం ఆధారంగా జస్టిస్ ఎన్ వి రమణను వ్యతిరేకించే వారు ఎక్కువగా ఉన్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. ఎవరైనా కుల వివక్ష చూపితే దాన్ని బాధ్యతగలవాళ్లు పరిష్కరించాలి. అయితే బాధ్యతగల వాళ్లే అలా చేస్తే…..? అది మరింత దురదృష్టకరం. ఏది ఏమైనా ఎవరు ఎలా చేసినా జస్టిస్ ఎన్ వి రమణకు ‘‘న్యాయం’’ జరిగింది.

న్యాయవ్యవస్థలో మర్పులకు శ్రీకారం

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి రమణ హయాంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ఆయన ఎన్నాళ్లుగానో ఆకాంక్షిస్తున్నారు.

దీనికోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఇదివరకే పిలుపునిచ్చారు. ఆయన హయాంలో ఈ సంస్థ ఏర్పాటయ్యే అవకాశముంది. న్యాయవిద్య నాణ్యతను పెంచాలని ఆయన భావిస్తున్నారు. సామాన్యులకు న్యాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జాతీయ న్యాయసేవల అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ రమణ ఇప్పటికే కీలక చర్యలు తీసుకున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఈ చర్యలను మరింత వేగవంతం చేసే అవకాశాలున్నాయి.

సాధారణ రైతు కుటుంబం నుంచి…

జస్టిస్‌ ఎన్ వి రమణ కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.

ఆయన పూర్తిపేరు నూతలపాటి వెంకట రమణ. ఆయన 1957 ఆగస్టు 27న జన్మించారు. తల్లిదండ్రులు గణపతిరావు, సరోజనీ దేవి. ఆయన విద్యాభ్యాసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగింది. ఆయన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.

న్యాయవాది నుంచి న్యాయమూర్తిగా

జస్టిస్ ఎన్ వి రమణ 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. ప్రజా సమస్యలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా అనేక అంశాలపై న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టులోనూ వాదనలు వినిపించారు. కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్స్‌లోనూ న్యాయవాదిగా వాదనలు వినిపించారు.

రాజ్యాంగం, క్రిమినల్‌, సర్వీస్‌, ఎన్నికలు, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసులను వాదించారు. రమణ ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా, 2000 జూన్‌ 27న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ రమణ 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తదుపరి ఏడాదే సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. జస్టిస్‌ రమణ మాతృభాషను అమితంగా అభిమానిస్తారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగులోనే సాగింది. సభలు, సదస్సుల్లోనూ తెలుగులో మాట్లాడటానికే ఇష్టపడతారు.

రాజకీయ నాయకులపై నమోదైన కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని కాలపరిమితి విధించి జస్టిస్ ఎన్ వి రమణ ఎందరో రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఇదే స్థాయిలో న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురాగలిగితే జస్టిస్ ఎన్ వి రమణ చీఫ్ జస్టిస్  గా జనం గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు.

Related posts

వరల్డ్ ఫుడీస్:బిర్యానీ కోసమే గూగుల్‌లో తెగ సెర్చింగ్

Satyam NEWS

మేడా మల్లికార్జున రెడ్డి కి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ?

Satyam NEWS

పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని ఆర్.డి.ఓ కు వినతిపత్రం

Satyam NEWS

Leave a Comment