హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపి గా ఎన్నిక కావడంతో ఖాళీ చేసిన ఆ నియోజకవర్గంలో తన భార్యను నిలబెట్టి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి గత అసెంబ్లీ ఎన్నికలలో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టిఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో మంచి ఫలితం సాధించేందుకు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులను మోహరించారు.
ఈ ఎన్నిక ఫలితం ప్రభుత్వాన్ని ఉంచడమూ కూల్చడమూ చేయలేదు కానీ గెలుపు ప్రతిపక్షాల ఆశలను సజీవంగా ఉంచుతుంది. అదే సమయంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం తగ్గిపోయిందనడానికి ఉదాహరణ గా ప్రతిపక్షాలు ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. అందుకే టిఆర్ ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. అయితే ఎప్పుడూ అక్కడ సెటిలర్ల ఓట్లు కీలకం.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో దాదాపుగా 45 నుంచి 50 వేల సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం విస్తరించి ఉన్న ఈ సెటిలర్ల ఓట్లు ఈ దశలో టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు కూడా కీలమైనవి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ టిడిపి కలిసి పోటీ చేసినందున రాష్ట్రం మొత్తం వ్యతిరేక పవనాలు వీచినా కూడా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలిచింది. అయితే మారిన రాజకీయ పరిస్థితులలో టిఆర్ఎస్ బలం పుంజుకున్నట్లుగానే కనిపిస్తున్నది.
జిల్లా పరిషత్ ఎన్నికలలో 4 జెడ్ పి టిసి లను మూడు ఎంపిపి పోస్టులను టిఆర్ ఎస్ సాధించి కాంగ్రెస్ పై పైచేయి సాధించింది. జిల్లా పరిషత్ ఎన్నికల మాదిరిగానే తమకు ఈ ఉప ఎన్నిక కూడా లాభసాటిగా ఉంటుందని టిఆర్ఎస్ అనుకుంటున్నది. అయితే సెటిలర్లు ఇప్పటికి టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం లేనందున తమదే విజయమని కాంగ్రెస్ భావిస్తున్నది. సెటిలర్లు గంపగుత్తగా ఓట్లు వేసే అవకాశం లేదని, చాలా మంది టిఆర్ ఎస్ వైపు వచ్చేశారని ఆపార్టీ చెబుతున్నది.
ఆంధా మూలాలు ఉన్నంత మాత్రాన వారు టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావించే వీలు లేదని, స్థానిక పరిస్థితుల ప్రభావంతో వారు టిఆర్ ఎస్ వైపు మొగ్గు చూపుతారని టిఆర్ ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఆంధ్రాలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నందున ఆంధ్రా తెలంగాణ మధ్య పోట్లాడుకునే వాతావరణం పోయిందని అందువల్ల సెటిలర్లు భిన్నంగా ఆలోచించే అవకాశం లేదని వారు అంటున్నారు.
ఏది ఎలా ఉన్నా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రెండు పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారి ఉన్నది.