పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీని పంజాబ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హరీశ్ రావత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేబినెట్‌లో చరణ్‌జిత్ సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దళిత సామాజికవర్గానికి చెందిన నేత. ప్రస్తుతం చామకౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2007లో ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇప్పటివరకూ మూడుసార్లు అదే నియోజక వర్గం నుంచి గెలుపొందారు. 2015-2016లో పంజాబ్ అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
పంజాబ్‌లో దళితుల జనాభా దాదాపు 33శాతంగా ఉన్న నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిని చేయడం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.