కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఆయన గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డెహ్రాడూన్ లోని మాక్స్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స జరుగుతోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రావత్ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు వాకబు చేశారు. ముఖ్యమంత్రిగా కేంద్ర జలవనరుల మంత్రిగానూ ఆయన పనిచేశారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. గత నెలలో హరీశ్ రావత్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. 2016 మార్చిలో బలపరీక్షకు ముందు కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఓ స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 2016లో తొమ్మిది మంది రెబల్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై హరీశ్ రావత్ ఓ జర్నలిస్టుతో మాట్లాడుతున్నట్టు వెలుగుచూసిన స్టింగ్ ఆపరేషన్ వీడియో సంచలనం సృష్టించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదనీ కుట్రపూరితంగా తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని రావత్ పేర్కొన్నారు.
previous post
next post