36.2 C
Hyderabad
April 25, 2024 22: 54 PM
Slider ప్రత్యేకం

శ్రమ దోపిడీకి పరాకాష్ట -తెలంగాణ ప్రభుత్వ దుశ్చర్య

#Vamshichandreddy MLA

స్వపరిపాలనకై కలలుగని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, నేడు మరోసారి కేసీఆర్ వంచనతో పరిహాసం పాలైందని మాజీ శాసనసభ్యుడు, ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాలను వ్యాసరూపంలో పంపారు.

వ్యాసం పూర్తిగా ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఆనాడు స్వపరిపాలన కోసం తెలంగాణ అని కేసీఆర్ పిలుపిస్తే యావత్ తెలంగాణ సమాజం ఐక్య పోరాటం చేసి, తెలంగాణ సాధించుకుంది. అప్పుడు  “స్వ” పరిపాలన అంటే తెలంగాణ సమాజ హితం కోసమని యావత్ తెలంగాణ  ప్రజలు భావించారు.

ఉద్యమ కీలక పాత్రధారుల ఆశలు అడియాసేనా?

కానీ “స్వ” పరిపాలన అంటే, కేసీఆర్ కోసమే అని, తన కుటుంబం కోసమే ప్రత్యేక తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు ఈనాడు అర్థమౌతుంది. ఎన్నెన్నో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, తమ  బతుకుల్లో నిండిన బాధల చీకట్లు తెలంగాణ రాష్ట్ర సాధన వెలుగులు నింపుతుందని ఆశపడిన తెలంగాణ ఉద్యమ కీలక పాత్రధారులైన విద్యార్థులు, నిరుద్యోగ యువత నేడు కాంట్రాక్టు ఉద్యోగులుగా మారి వెట్టిచాకిరి చేస్తున్నామని  కేసీఆర్ ప్రభుత్వానికి తమ ఆవేదన పట్టడంలేదని తమ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. 

సుమారు 4 కోట్ల జనాభా గల తెలంగాణ రాష్ట్రానికి, కేవలం 0.75%, అంటే దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు అవసరం కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన 2014 నుండి ఇప్పటి వరకు కనీసం 30 వేల ప్రభుత్వ నియామకాలు కూడా జరపలేదు.

అసలు ఖాళీలతో పాటు, ఉద్యోగ విరమణల వల్ల ఏర్పడిన ఖాళీలలో కూడా నియామకాలు చేపట్టలేదు. ఇంకా ఏవైనా నియామకాలు  జరిగినా, అవన్నీ ఒప్పంద పద్ధతి లేదా పొరుగు సేవల పద్ధతిలోనే జరిగాయి.

సమాన పనికి సమాన వేతనం అని మన దేశ కార్మిక చట్టాలు నిర్దేశిస్తున్నా, కేసీఆర్ ప్రభుత్వం  కార్మికచట్టాలకు తిలోదకాలిస్తూ, కంచే చేను మేసిందన్నట్లుగా, శ్రామికులను కాపాడాల్సిన కేసీఆర్ ప్రభుత్వం  వివిధ ప్రభుత్వ శాఖల్లో  శ్రమ దోపిడీకి పాల్పడుతున్న తీరుతో పని ఒత్తిడి అధికమై గగ్గోలు పెడుతున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఒప్పంద పద్ధతి,  పొరుగు సేవల పద్ధతి ద్వారా పని చేస్తున్న ఉద్యోగుల వేదనను మానవత్వంతో సాటి మనుషులుగా మనం కాస్త అర్థం చేసుకొందాం. 

శ్రమదోపిడీకి నిదర్శనం పంచాయతీ కార్యదర్శి వ్యవస్థ 

సమాన పనికి సమాన వేతనమని, పొరుగు సేవలు- కాంట్రాక్టు ఉద్యోగాలు చట్ట వ్యతిరేకమని, శ్రమ దోపిడీ అన్యాయమని, వెట్టి చాకిరి అనైతికమని  అనేక సార్లు సినీ పక్కీలో డైలాగులు చెప్పి, తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులను  నమ్మించి గద్దెనెక్కిన కేసీఆర్, రాజ్యాంగానికి, కార్మిక చట్టాలకు విరుద్ధంగా  బాండ్లపై సంతకాలు చేయించుకొని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలు చేపట్టి, వారి జీవితాలతో చెలగాటం ఆడడం దారుణం.

 అసలు తెలంగాణ వచ్చిన తరువాత ఉద్యోగాలే దొరకట్లేదని, 2014 తరువాత ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1,2,3,4 నియామకాలను అసలు ఒక్కసారి కూడా  చేపట్టలేదని వాపోతూ, ప్రభుత్వ ఉద్యోగం వస్తే తమ వంశంలో ఒక తరం బాగుపడుతుందని ఆశించి, బాండ్లపై సంతకాలు చేసి బానిసలైపోయామని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు బాధ పడుతున్నారు.

కేవలం 7ముఖ్య విధుల కోసమని నియామక పత్రాల్లో చెప్పి, 50కి పైగా  విధులు నిర్వహించాల్సిన వేదనను భరిస్తూ, అరకొర జీతాలకు రోజుకు 12 గంటలు పనులు చేసినా, ఇచ్చే అరకొర జీతం డబ్బులు కూడా మూడు నెలలకు ఒకసారి ఇవ్వడాన్ని మించిన శ్రమదోపిడి మరెక్కడైనా ఉంటుందా అని  రోదిస్తున్నారు. 

కోర్టుకు వెళ్లం అని ముందుగానే రాసివ్వాలా?

దేశంలోని  ఏ సంస్థలైన, ఎటువంటి వ్యవహారాల్లో ఐనా వివాదాలను, నిర్దిష్ట రాజ్యాంగ నిబంధనల మేర, చట్ట ప్రకారం, నిర్దిష్ట కోర్టుల పరిదుల్లో పరిష్కరించుకోవాలని అధికారిక లావాదేవీ పత్రాల్లో తెలియజేస్తారు. మన తెలంగాణాలో మాత్రం దానికి విరుద్దంగా సమస్యలను  కోర్టు దృష్టికి తీసుకు వెళ్లరాదని, లిఖిత పూర్వకంగా తెలుపుతూ, నియామకాలు జారీ చేయడం ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనని, మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.   

వాస్తవానికి, దాదాపు  రూ. 30 వేల జీతంతో పనిచేసే పంచాయతీ కార్యదర్శుల పనితో పాటు రూ.10 వేల జీతం పొందే ఫీల్డ్ అసిస్టెంట్ల పని కూడా చేస్తూ కేవలం రూ.15 వేల  ఏకమొత్తపు వేతనం (కన్సాలిడేటెడ్ పే) పొందుతున్నారు. కార్మికచట్టం ప్రకారం విధి నిర్వహణకు జరిగే రవాణా, పోస్టల్, సాంకేతిక సదుపాయాలఖర్చులను, ప్రభుత్వమే  భరించాలి.

 కానీ దానికి విరుద్ధంగా,  జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వారి విధుల నిర్వహణకు  వాహన నిర్వహణ – పెట్రోలు ఖర్చులు గాని, మొబైల్ – ఇంటర్నెట్ ఖర్చులు, కరోనా కాలంలో పెరిగిన శానిటైజేషన్ -మాస్కులు  తదితర ఖర్చులకు సైతం పైసా విదల్చడం లేదని, వాపోతున్నారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వారి జీతంలో విధి నిర్వహణ ఖర్చులకే అధిక శాతం కేటాయించి, చాలీ చాలని జీతంతో, వచ్చే అరకొర జీతం కూడా 3-4 నెలలకొకసారి ఇవ్వడం వల్ల కుటుంబ పోషణ భారమై అప్పుల ఊబిలో చిక్కు కుంటున్నామని, తమ బతుకు, భవిత అగమ్యగోచరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్మిక చట్టాలను అమలు చేయడం లేదు  

మన దేశంలోని  కార్మిక చట్టాల ప్రకారం రోజుకు కేవలం 8 పని గంటలేనని, అదనపు పని గంటలకు అదనపు జీతం (ఓ.టీ ) చెల్లించాల్సిందేనని మరోపక్క కార్మిక సంఘాలు తలబాదుకుంటున్నాయి. అసలు కార్మిక చట్టాల ప్రకారం, దేశంలోని ఏ రాజ్యాంగబద్ద వ్యవస్థలోనైనా 6 నెలల పాటు పని చేస్తే, వారికి శాశ్వత ఉద్యోగ హోదా లభిస్తుందని, ప్రొబేషనరీ పీరియడ్ 3 సంవత్సరాలు అని నియామక పత్రంలో పేర్కొనడం ముమ్మాటికీ చట్ట వ్యతిరేకమని కార్మిక చట్టాల న్యాయ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు.  

పేరుకు ప్రభుత్వ ఉద్యోగమైనా బాండ్లపై సంతకాలు చేసి మా వృత్తిపరమైన సమస్యలను కోర్టులకు కూడా విన్నవించుకోలేక, ప్రభుత్వానికి బానిసలుగా మారి వెట్టిచాకిరీ చేస్తున్నామని గుండెలవిసే వారి ధీనగాథను చెమర్చే కళ్ళతో చెప్పుకుని కుమిలిపోతున్నారు. 

 అర్హులైన టీచర్లకు బదులుగా , విద్యావాలంటీర్లతో మమ…!

 దాదాపు 50వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలున్నా, డి.ఎస్.సి, టెట్ తదితర ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఉపాధ్యాయ వనరులున్నా కేసీఆర్ ప్రభుత్వం  వారి  నియామకాలు చేపట్టలేదు. బీసీ, ఎస్. సీ, ఎస్.టీ, మరియు గురుకుల పాఠశాలల్లో కనీస ప్రాతిపదికన చేపట్టాల్సిన 4000 ల నియామకాలను కూడా చేపట్టడం లేదు.

కేసీఆర్ ప్రభుత్వం కేవలం విద్యావాలంటీర్లతో పాఠశాల విద్యను కొనసాగిస్తూ, ఒకవైపు విద్యావాలంటీర్ల శ్రమ దోపిడీకి పాల్పడుతూ, మరోపక్క అర్హులైన ఉపాధ్యాయులను పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే  నిరుపేద విద్యార్థులైన  భావి తెలంగాణ పౌరులకు నాణ్యమైన విద్యకు దూరం చేస్తూ ఇరువర్గాలకు తిరిగి పూడ్చుకోలేని అన్యాయం చేస్తుంది. 

ఖాళీలున్నా… కాంట్రాక్టు లెక్చరర్లతో…!

పేరుకు విశ్వవిద్యాలయాలు, చేపట్టాల్సిన కనీస నియామకాలు దాదాపు 9000 మాత్రమే. అయినా కూడా  డిగ్రీ, పీజీ , సాంకేతిక, పాలిటెక్నీక్ తదితర కళాశాలల్లో, కాంట్రాక్టు లెక్చరర్లచే విద్యా బోధన చేపడుతూ, రెగ్యులర్ లెక్చరర్ల బాధ్యతలను కూడా వీరితోనే చేయించుకుంటూ పేరుకు లెక్చరర్ అయినా తృతీయ శ్రేణి ఉద్యోగులుగా వేతనాలు పొందుతూ శ్రమ దోపిడీతో పాటు వంచనకు గురి ఔతున్నారు. 

 విద్యార్థుల కోణంలోంచి చూస్తే, పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్య వరకు, అంటే బాల్యం నుండి యువత జీవితంలో  ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులుగా మారే సమయంలో  కూడా పూర్తి స్థాయి అధ్యాపకుల ద్వార విద్యను అందుకోలేక నష్టపోతున్నారు మన తెలంగాణ విద్యార్థులు.

కేజీ టు పీజీ అంటే బాల్యం నుండి ఉన్నత విద్యవరకు ఎక్కడ కూడా నాణ్యమైన విద్య అందని ప్రస్తుత దారుణ  పరిస్థితి.  మరి గులాబి రంగోల్ల బంగారు తెలంగాణాలో కేజీ టు పీజీ అంటే ఇదేనేమో!

 లక్ష్యం మిషన్ భగీరథ…బాధ్యతలు కాంట్రాక్టు వ్యధ

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ. 40000 కోట్లకు పైగా ఖర్చుతో  తలపెట్టి స్వయంగా 2016లో దేశ ప్రధానమంత్రి ప్రారంభించిన ఇంటింటికి త్రాగునీరందించే మిషన్ భగీరథ  పథకంలో కూడా శ్రమదోపిడి రాజ్యమేలుతుంధి. బి.టెక్ , ఎమ్.టెక్ పూర్తిచేసిన దాదాపు 1000 మంధి ఉద్యోగాలలో చేరితే, పని ఒత్తిడి తట్టుకోలేక అనేకమంది ఉద్యోగస్థులు స్వచ్ఛంద రాజీనామాలు చేసి తప్పుకున్నారు.

వీరందరూ  పొరుగు సేవల పద్ధతిలో నియమించ బడ్డవారే. వీరి శ్రమ దోపిడికి పాల్పడడమేగాక, ఏమాత్రం కనికరం లేకుండా కరోనా కష్టకాలంలో 709 మంది జూనియర్ అసిస్టెంట్లను, వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించటం ప్రభుత్వ ఉద్యోగస్థులను, నిరుద్యోగులను కబళించే కర్కశచర్య అని కంఠనాళాలు తెగేలా ఆక్షేపిస్తున్నారు.

కాంట్రాక్టు పద్ధతిలో  టిమ్స్ వైద్యుల నియామకం, ప్రభుత్వ శ్రమదోపిడికి పరాకాష్ట.

 ప్రపంచమంతా కరోనా మహమ్మారి తో పోరాటం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో,  ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరోనా అంటువ్యాధి విజృంబిస్తున్న  వేళ కరోనా రోగులకు సేవలందించే వైద్యుల వెన్నుతట్టి భరోసానివ్వాల్సిన ప్రభుత్వం, ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులను సైతం ఒప్పంద పద్దతిలో నియామకాలు చేపట్టడం ప్రభుత్వం బాహాటంగా చేస్తున్న శ్రమదోపిడికి పరాకాష్టే కదా?! 

గతేడాది నియమించబడ్డ రాష్ట్ర వైద్యారోగ్య  సర్వీసుల నియామక మండలి (మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు) చేసిన మొట్టమొదటి నియామకం ద్వారా నియమితులైన ప్రభుత్వ వైద్యులు కేవలం ఒక సంవత్సర కాల పరిమిత ఉద్యోగానికి, తమ వ్యక్తిగత  జీవితాలను  పణంగా పెట్టి, వైద్య సేవలందిస్తూ శ్రమ దోపిడీకి గురవడం శోచనీయం. 

తెలంగాణ సాధనకు 610 జీవో పేరు చెప్పి, ఉద్యోగాల ఆశ చూపి ప్రభుత్వ ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను వంచించింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా  ఉద్యోగార్ధుల పరిస్థితి ఇంకా దారుణస్థితికి చేరుకోవడం, స్వయం పాలనకోసం పోరాడిన తెలంగాణ సమాజం, స్వయంపాలకుల చేతిలో శ్రమ దోపిడీకి గురికావడం  జీర్ణించుకోలేక గుండె పగిలేలా రోదిస్తుంది.

 మన దగాపడి దిగాలు పడిన మన తెలంగాణము. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం,  ఆకాంక్షలు, భవిష్యత్ ఆశయాలు  విస్మరించి, మాయ మాటలతో మోస పూరితంగా మభ్య పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తగిన రీతిలో నిలదీయక  పోతే, భవిష్యత్ తరాల వారి జీవితాలు మరింత అంధకారంలోకి నెట్టబడతాయనే సత్యాన్ని జనాలు ఇకనైనా గ్రహించాలి.

చట్టబద్ధంగా పాలన సాగించాలని తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి అధికారం కట్టబెడితే, కేసీఆర్ ప్రభుత్వమే స్వయంగా   రాజ్యాంగ విరుద్దంగా శ్రమదోపిడీకి పాల్పడడం కేసీఆర్ ప్రభుత్వ దమననీతికి పరాకాష్ట. ఇటువంటి దుర్మార్గ, దురహంకార పాలనకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు  యావత్తు తెలంగాణ సమాజం గళమెత్తి, కదంతొక్కి నిఖార్సుగా నిగ్గదీసి నిలదీయడం మన ప్రస్తుత బాధ్యతగా ప్రతీ ఒక్కరూ భావించాలి.

 ప్రభుత్వానికి బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా మావంతు బాధ్యతగా యావత్తు తెలంగాణ సమాజానికి అనుక్షణం అండగా ఉంటామని సవినయంగా తెలుపుకుంటూ….

 వ్యాసకర్త: చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు, ఏఐసిసి  కార్యదర్శి.

Related posts

వరంగల్ గ్రేటర్ పై గులాబీ జెండా ఎగరాలి

Satyam NEWS

నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న టాస్క్ ఫోర్స్

Satyam NEWS

సంబంధిత పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment