ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి చనిపోవడం చాలా దురదృష్టకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో నేడు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జీవితాలు బాగుపడతాయని కార్మికులు ఆశించారని అయితే వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా అటు కార్మికులు, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూబా బంద్ లో కార్మికుల ఆత్మహత్యలు ఎప్పుడు జరగలేదని తెలంగాణ ప్రభుత్వం ఉన్నాక కూడా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని జగ్గారెడ్డి అన్నారు. ఆత్మ గౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని అలాంటి తెలంగాణలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు బిజీగా ఉండడం వల్ల రాలేక పోతున్నారని, ఎన్నికల తర్వాత కార్మికుల ఉద్యమంలో ఆయన పాల్గొంటారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సిఎం కేసీఆర్ కు కార్మికుల సమ్మె వల్ల చెడ్డపేరు వస్తోందని అందువల్ల ఒక్క అడుగు వెనక్కి వేసి కార్మికులతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ ఉద్యమం చేయి దాటితే మహాసంగ్రామం అవుతుందని జగ్గారెడ్డి హెచ్చరించారు. మంత్రులు తమ చాతగాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
previous post