28.2 C
Hyderabad
April 20, 2024 12: 39 PM
Slider జాతీయం

మాహిష్మతీ ఊపిరి పీల్చుకో…. రాహుల్ మళ్లీ వస్తున్నాడు..

#gandhifamily

దశాబ్దాల చరిత్ర కలిగి, మహామహులు ఎందరో సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ సరికొత్తరూపు ఎత్తుకోడానికి,కొత్త నీరు నింపుకోడానికి,  సాహసపేతంగా ముందుకు వెళ్తోంది.సోనియాగాంధీ కుటుంబమే ఆన్నీ తానై వ్యవహారిస్తోంది.ముఖ్యనేత రాహుల్ గాంధీ దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నారు.

కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు.అవి స్వయంగా ఆయనకే వచ్చిన ఆలోచనలా,వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పథక రచనా? తెలియడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుంది. ఈలోపు మంచి జరుగుతోందా, చెడు జరుగుతోందా భావి ఫలితాలే నిర్వచిస్తాయి.

పార్టీని వీడి వెళ్లిపోతున్న సీనియర్లు

ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క సీనియర్ నేత పార్టీని వీడుతున్నారు.ఇప్పటికే అస్సాం,పుదుచ్చేరి వంటి కాంగ్రెస్ కంచుకోటల్లోనూ అధికారాన్ని కోల్పోయారు. ప్రతి రాష్ట్రంలోనూ గందరగోళ వాతావరణం నెలకొని వుంది. జరిగే పరిణామాలు సంచలన వార్తలకు కేంద్రాలుగా మారుతున్నాయి.

కపిల్ సిబల్ వంటి సీనియర్ నేతలు తలపట్టుకొని కూర్చుంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీ డబ్ల్యూ సీ ) సమావేశం ఏర్పాటుచేయమని ఒత్తిడి తెస్తున్నారు. జి -23 గా చెప్పుకొనే ఆ నాయకబృందమంతా తాడోపేడో తేల్చుకోవాలనే చూస్తున్నారు.

ఒకప్పటి వలె పార్టీపై తమకు పట్టుకావాలని,కాంగ్రెస్ కు పూర్వవైభవం రావాలని వారంతా కోరుకుంటున్నారు. ఇంతవరకూ సంస్థాగత ఎన్నికలే జరుగలేదు.పార్టీ కంటూ అధ్యక్షుడు లేడు. పార్టీలోని మంచిచెడును విశ్లేషించుకుంటూ ముందుకు సాగడానికి,నవనిర్మాణం జరపడానికి దేశమంతా ‘ ‘చింతన్ భైటక్’ లు నిర్వహిస్తామని చెప్పి కూడా చాలాకాలమైంది.

అధికారంలో ఉన్న కొద్ది చోట్లా తలనొప్పులు

అది ఇంతవరకూ ఆచరణకు నోచుకోలేదు.అధికారంలో ఉన్న కాసిన్ని రాష్ట్రాలలోనూ కొత్త కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు.వచ్చే సంవత్సరంలో విడతల వారీగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సమాయిత్తం కావాల్సి వుంది.

ప్రజాబలం,క్యాడర్ లో విశ్వాసం ప్రోది చేసుకోకపోతే మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది.పంజాబ్ లో పరిణామాలు చాలు! ఏ రీతిన పార్టీని నడుపుతున్నారో అర్ధం చేసుకోడానికి,అని వచ్చే విమర్శలకు సహేతుకమైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.కాంగ్రెస్ తో, ఇందిరాగాంధీ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం కలిగివున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ కు ఉద్వాసన పలికిన తీరు,సమయం వివేకవంతమైనది కాదని మెజారిటీ రాజకీయ పండిత వర్గం అంటోంది.

అదే సమయంలో కొత్తనీరును స్వాగతించే క్రమంలో,నవ్ జోత్ సింగ్ సిద్ధూ వంటి ఆవేశపరుడు, చంచలస్వభావుడిని అందలమెక్కించడం అంత తెలివైన చర్య కాదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.రాష్ట్ర నాయకుల మొదలు అధిష్టానాన్ని కూడా అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

గత ఎన్నికలకు కాస్త ముందుగా బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరాడు.మరి కొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నాయనంగా,సరికొత్తగా స్వీకరించిన రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామ చేశాడు.ఆ మధ్య ‘అప్’ లో చేరతానంటూ హడావిడి చేశాడు. ఇవన్నీ బ్లాక్ మెయిల్ ధోరణులే. పంజాబ్ కు మొట్టమొదటిసారిగా దళితనేతను ముఖ్యమంత్రిని చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు వెల్లువెత్తాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగిస్తామని భరోసా ఇస్తూ, దళితులను,వెనుకబడి వర్గాలను అధికార పీఠాలపై కూర్చోబెడతమనే స్లోగన్ వినిపిస్తే,దేశ రాజకీయలు కొత్త మలుపు తీసుకుంటాయి.ఆ పని చేస్తారా లేదా చూడాలి. పార్టీకి కొత్తరక్తం ఎక్కించి,కొత్తనీరుకు ద్వారాలు తెరిచే క్రమంలో,పాతపాళీలను కూడా మరువరాదు.ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో,మేలైన పాతకొత్తల మేళవింపు అవసరమని భావించాలి.

బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ

అధికార బిజెపి చాలా బలంగా ఉంది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అంతే బలంగా ఉన్నాయి. నరేంద్రమోదీ ప్రభంజనం ఇంకా మసకబారలేదు.గ్రాఫ్ కొంత తగ్గిఉండవచ్చునేమో కానీ, ఆయన నాయకత్వ పటిమ,పార్టీ రెండూ బలంగానే ఉన్నాయి.

పంజాబ్ లో రాజకీయాలు రోజుకొక్క తీరున రాజుకుంటున్నాయి.కెప్టెన్ అమరీందర్ రేపోమాపో కొత్తదారి వెతుక్కుంటారు. ఆయన ఏ పార్టీలో చేరినా, రేపటి ఎన్నికల్లో పార్టీకి ఎంతోకొంత నష్టం జరుగుతుంది.సిద్ధూతో రాజీ కుదిరినా,అటువంటి వ్యక్తిని నమ్ముకొని పార్టీ ప్రశాంతంగా మనజాలదనే భావించాలి.

ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా,తన ఆజ్ఞ మేరకే ప్రతిదీ నడవాలనే ధోరణిలో సిద్ధూ ఉన్నారు. దళితులు 32శాతం ఉన్నారు. సిద్ధూకు దళిత వ్యతిరేకనే ప్రచారం ఉంది. ఇటువంటి వాతావరణం నడుమ,పార్టీ పట్ల దళితుల్లో విశ్వాసం పెంచడం అంత తేలికైన పనికాదు.

సునీల్ జాఖడ్ వంటి సీనియర్లను కాదని చన్నీని ముఖ్యమంత్రిగా చెయ్యడం కూడా మరో సాహసం.ఈ చర్యతో పార్టీలో వర్గపోరు మరింత పెరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిగిలిన ఛత్తిస్ గడ్, రాజస్థాన్ లోనూ అసమ్మతులు రగులుతూనే వున్నాయి. వీటన్నిటిని తట్టుకుంటూ పార్టీని నడపడం, విజయతీరాలకు చేర్చడం సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక త్రయానికి అతిపెద్ద సవాల్.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యంపై నారాయణకు పిహెచ్ డి

Satyam NEWS

రవాణా శాఖ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు

Satyam NEWS

Leave a Comment