20.7 C
Hyderabad
February 5, 2023 03: 51 AM
Slider ప్రత్యేకం

20 లక్షల ఎకరాల అసైన్ భూమిపై కేసీఆర్ కన్ను పడింది

#shabirali

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల అసైన్ భూమిపై కేసీఆర్ కన్ను పడిందని, కామారెడ్డి ప్రాంతంలో 8 వేల ఏకరాలలో రోడ్లు వేసుకుని టిఆర్ఎస్ బ్రోకర్లు అమ్ముకోవాలని చూస్తున్నారని మాజి మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. గత సంవత్సరం వరివేస్తే ఉరే అన్న కేసీఆర్ ఈ సంవత్సరం వరిపంటపై ఎలాంటి ప్రకటన చేయలేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.

రైతులు బాజాప్త వరి వేసుకోవాలని ఒకవేళ ప్రభుత్వం వరిదాన్యం కొనకుంటే ప్రభుత్వాన్ని నేలకేసి కొడతామని హెచ్చరించారు. రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, పోడు భూములు, రైతు సమస్యల పరిష్కారం, అవినీతి పాలనకు వ్యతిరేకంగా కామారెడ్డి కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఎకరం కూడా భూమి ఇవ్వలేదని, కాంగ్రెస్ ఇచ్చిన భూములను మాత్రం గుంజుకుంటుందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల భూమిని భూమి లేని నిరుపేదలకు రాజీవ్ గాంధీ ఇచ్చారని, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగు విడతల్లో 19200 ఎకరాల భూములను రైతులకు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వంపై ప్రజలు కొట్లాటకు సిద్ధం కావాలని, ప్రజలకు తాము వెన్నంటి ఉంటామన్నారు. ప్రజలకు పథకాల ద్వారా ఇచ్చే డబ్బు ప్రజలదని, దానిని ఇవ్వకపోవడానికి కేసీఆర్ ఏమైనా ఇంట్లోంచి ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

60 సంవత్సరాల పాలనలో 60 వేల కోట్ల అప్పు ఉంటే కేవలం ఎనిమిదిన్నర ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు చేసారని, ప్రతి పుట్టబోయే బిడ్డపై 1.25 లక్షల అప్పు పెట్టారన్నారు. ధరణి పోర్టల్ తో దండుకుంటున్నారని, రెవిన్యూలో డబ్బులు ఇవ్వకపోతే పనులు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు తిరగబడుతున్నారని, అధికారులను ఎసిబికి పట్టిస్తున్న మార్పు రావడం లేదన్నారు.

అటవీ భూములపై అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని, ఇటీవల ఎల్లంపేటకు చెందిన ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై తన భూమిలోకి వెళ్తే 13 వేల జరిమానా విధించారన్నారు. అటవిహక్కు చట్టం కాగితాలు ఉన్నా అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూములు, అసైన్ భూములు ప్రజలకే ఇస్తామని, పాస్ పుస్తకాలు ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ఇంటికే తెచ్చి ఇస్తామన్నారు.

రైతులకు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇక్కడి రైతులకు రుణమాఫీ చేయలేని కేసీఆర్.. పంజాబ్, హర్యానా, యుపి రైతులకు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో లక్షల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. తన సొంతభూమి 2.35 ఎకరాలు ధరణి నుంచి మిస్సయిందని, ఇటీవలే 27 గుంటల భూమి వచ్చిందని, మిగతా భూమి ఎక్కడెక్కడో తిరుగుతుందని, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉందేమో వెతికి తీసుకురావాలని చమత్కరించారు.

గోదావరి జలాల ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 3.54 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఇక్కడే శంకుస్థాపన చేశామని, ప్యాకేజి 22 ద్వారా సాగునీరు అందించేందుకు పనులు చేపడితే ఈ ప్రభుత్వం ఆ పనులను చేయడం లేదని తెలిపారు. లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కట్టినా ఒక్క వర్షానికే బాహుబలి మోటార్లు మునిగిపోయాయని, ఇప్పుడు ఆ విషయంపై కేసీఆర్ ఎక్కడ కూడా మాట్లాడటం లేదని, ఆ డబ్బులు కేసీఆర్ ఇంట్లోకి వెళ్లాయని విమర్శించారు. ధరణి పోర్టల్ తో రైతులు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారని, ఇలాగే జరిగితే నక్సలైట్లను ఆశ్రయించే అవకాశం ఉందన్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తేవాలని కోరారు.

కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం

నిరసన చేపడుతున్న చోట నుంచి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో వేలాదిగా కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. కాంగ్రెస్ చేపట్టిన ముట్టడి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే పోలీసులు కలెక్టరేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినా అనుకున్న స్థాయిలో పోలీసులను మోహరించలేకపోయారు.

దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్ కు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో బారికేడ్లను తోసుకుని కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం షబ్బీర్ అలీతో పాటు మరో 15 మందికి మాత్రమే కలెక్టర్ ను కలవడానికి పోలీసులు అనుమతి కల్పించారు.

అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ లో షబ్బీర్ అలీ బైఠాయింపు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించడానికి షబ్బీర్ అలీ ముందస్తుగానే కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. పోలీసుల అనుమతితో కలెక్టర్ ను కలవడానికి వెళ్లిన షబ్బీర్ ఆలీకి కలెక్టర్ ఇప్పటిదాకా చూసి ఇప్పుడే భోజనానికి వెళ్లిపోయారని అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ కు వినతిపత్రం ఇవ్వాలని ఆయన ఛాంబర్ కు తీసుకెళ్లారు.

అపాయింట్ మెంట్ తీసుకున్నా కనీసం 5 నిమిషాలు కూడా వెయిట్ చేయలేరా అంటూ షబ్బీర్ అలీ అసహనం వ్యక్తం చేసారు. కలెక్టర్ భోజనం చేసి వచ్చే వరకు ఇక్కడే ఉంటామని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో కింద కూర్చుని నిరసన తెలిపారు. తాను ముందుగా అపాయింట్ తీసుకున్నా ఎలా వెళ్తారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. 10 నిమిషాల తర్వాత కలెక్టర్ కు సమాచారం ఇవ్వడంతో క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ రావడంతో షబ్బీర్ అలీ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

కాంగ్రెస్ సర్పంచ్ చేతికి గాయం.. చిరిగిన చొక్కా

కలెక్టరేట్ ముట్టడి సందర్బంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, కార్యకర్తలకు జరిగిన తోపులాటలో రామారెడ్డి మండలం పోసానిపేట సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి ఎడమ చేతికి గాయమైంది. తోపులాటలో మహేంధర్ రెడ్డి చొక్కా పూర్తిగా చిరిగిపోయింది. తనపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని సర్పంచ్ మహేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. పోలీసుల తీరు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించారు.

Related posts

రఘునాథ చెరువును కాలుష్యం నుంచి కాపాడండి

Satyam NEWS

ఆసక్తి రేపుతున్న కొత్త జంట

Satyam NEWS

కోవిడ్ జాగ్రత్తలు అవసరం.. అతి విశ్వాసం వద్దు.. వైద్యులు

Sub Editor

Leave a Comment

error: Content is protected !!