ఎన్నికల ఫలితాలు చూసి కొందరు పొంగిపోవచ్చనిఅయితే ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ పొంగిపోదు, కుంగిపోదని మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అయన ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవకపోతే మంత్రి పదవులు పోతాయని హెచ్చరించారని, దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారిని మంత్రులు బెదిరించారని అన్నారు.
ఈ ఎన్నికల్లో తెరాస డబ్బును, మద్యాన్ని, పోలీసులను నమ్ముకుని నిబంధనలను అడ్డగోలుగా అతిక్రమించిందని ధ్వజమెత్తారు.దాదాపు 25 మున్సిపాలిటీల్లో తెరాసకు 50 శాతం సీట్లు రాలేదు. చాలా చోట్ల ఆ పార్టీ పూర్తి స్థాయిలో గెలువలేదు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా సిరిసిల్లలో 10 మంది స్వతంత్రులు గెలిచారు. గజ్వేల్లో ఆరుగురు రెబల్స్ కేసీఆర్‌కు వ్యతిరేకంగా విజయం సాధించారు. తెరాస గెలుపుతో ప్రజలపై పన్నుల మోత మోగించబోతోంది. రాష్ట్రంలో తెరాసకు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం. భాజపా బలం పాలపొంగులాంటిదే’ అని రేవంత్ అన్నారు.
తెలంగాణ మంత్రులపై టీకాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అదే సమయంలో, రాష్ట్ర ఎన్నికల సంఘంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేటీఆర్ యత్నించారని ఆరోపించారు. హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ లు మాట్లాడిన తీరు అదేవిధంగా ఉందని ఆరోపించారు. కేటీఆర్ సహా వీళ్ల పై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నోటీసు ఇచ్చి వివరణ ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు.
తన ఓటు ఎవరికి వేశారో ఆ విషయాన్నిబహిరంగంగా ప్రకటించిన గంగుల కమలాకర్ పై ఇప్పటి వరకు క్రిమినల్ కేసును ఎన్నికల నిర్వహణ అధికారులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి బేరసారాల విషయానికి సంబంధించిన బయటకు వచ్చిన టెలిఫోన్ సంభాషణల ఆడియో టేప్ పై తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం కేసు పెట్టకపోవడం దారుణమైన విషయమని మండిపడ్డారు.