భారత రాజ్యాంగం పేదలకు, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు దిక్సూచి లాంటిదని దళిత మహాసభ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి బెంజిమెన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆదివారంపేట నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఛలో అసెంబ్లీ ర్యాలీ మంగళవారం నిర్వహించారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇలిసిపురం వద్ద అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949 నవంబరు 26వ తేదీన కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను అడాప్ట్ చేసుకుందని చెప్పారు. 1950 నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని వివరించారు.
అమలులోకి వచ్చి నవంబర్ 26వ తేదికి 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ నిర్వహించుకునే ‘రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా ప్రజలకు నా శుభాకాంక్షలు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో మనం రూపొందించుకున్న భారత రాజ్యాంగం, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అనడంలో సందేహం లేదని తెలిపారు.
భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగం గొప్పతనమేనని అన్నారు. అంతటి మహత్తరమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ అంబేద్కర్ మనకు చిరస్మరణీయుడని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నాను అని వ్యాఖ్యానించారు.
నేడు రాజ్యాంగ ఫలాలు పేదలకు అందడం లేదని, మనోవాదులు రాజ్యాంగ ఫలాలను అందుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ మొత్తం మీద భారత ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని తెలిపారు. అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా కనీస అవసరాలు కూడా తీరని పేదలు, బడుగులు దేశంలో చాలా మంది ఉన్నారని తెలిపారు.
తారతమ్యాలు లేని, లింగ వివక్ష లేని, సమానత్వం రావాలంటే సంపద అందరికీ చెందాలని ఆకాంక్షించారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశం సమానంగా అందినప్పుడే రాజ్యాంగ ఫలాలు అందరికీ అందినట్టు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్, బోనెల అప్పారావు, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు పోతుల దుర్గారావు, అర్జి కోటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా, ఎపీ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నూతులపాటి భరత భూషణ్‌రాజు, సీనియర్ అడ్వకేట్ బి. మురళీకృష్ణ, అడ్వకేట్ జాన్, అంపోలు ప్రతాప్, అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పిన్నింటి అప్పన్న, నందేష్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్ మూర్తి, బి. సంజీవరావు, గోవిందరావు, కె సూర్యనారాయణ, ధర్మారావు మాస్టారు, లక్ష్మీనారాయణ, జి రమణ, బమ్మిడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.