జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను నిలుపుదల చేయడం అన్యాయమని వాటిని వెంటనే పునరుద్ధరించాలని పల్నాడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం సి ఐ టి యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అవ్వారు ప్రసాదరావు, సిలార్ మసూద్ లు డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సోమవారం గుంటూరు జిల్లా నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు. భవన నిర్మాణ కార్మికుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ వెంటనే సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని,భవన నిర్మాణ బిల్డర్లు, ప్రభుత్వ కాంట్రాక్టర్ల వద్ద నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కు జమ కావలసిన సెస్సు సక్రమంగా వసూలు చేసి సంక్షేమ బోర్డు లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా సంక్షేమ బోర్డు లో ఉన్న 450 కోట్ల నిధులను ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు తరలించిందని ఇది అన్యాయమని వారన్నారు. భవన నిర్మాణ కార్మికుల నోర్లు కొట్టి వారి కుటుంబాలను విధులు పాలు చేసిందని, భవన నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఇరవై వేల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే కుండా భవన నిర్మాణ కార్మికుల డబ్బులను మిగులు నిధులు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం విడ్డూరమన్నారు.
కరోనా కష్టకాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నుంచి ఆరు వేల వరకు భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత ను సృష్టించిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఇసుక పేరుతో వేల కోట్ల రూపాయలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు, ప్రభుత్వ సహజ సంపదను ప్రజల రక్తం పీలుస్తూ ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నదని, ఇసుక సిమెంటు ధరలు విపరీతంగా పెరగడం వల్ల చిన్న మధ్యతరహా ప్రజానీకం ఇండ్లు నిర్మించుకో లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఎక్కువ మందికి పనులు లేక రోడ్ల పాలు అవుతున్నారని దుయ్యబట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమస్యలు పరిష్కారం కొరకు ధర్నా అనంతరం కార్యాలయం అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి డి శివ కుమారి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంగలకుదురు ఆంజనేయులు, సహాయ కార్యదర్శి కాసు కోటిరెడ్డి, కొమ్ముల సురేష్, రొంపిచర్ల పురుషోత్తం, వెంకటప్పయ్య, తిరుమల చారి, భువనగిరి వెంకటేశ్వరరావు, చట్టు రవి, బత్తుల బాలకోటయ్య, పఠాన్ మస్తాన్ వలి లు నాయకత్వం వహించారు ఈ కార్యక్రమానికి కౌలు రైతు సంఘం గుంటూరు పశ్చిమ జిల్లా కార్యదర్శి కామినేని రామారావు, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలాని మాలిక్ మద్దతు తెలియజేశారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్