27.7 C
Hyderabad
March 29, 2024 02: 58 AM
Slider సంపాదకీయం

కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు

#Y S Jaganmohan Reddy

ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది. ఏపిలో ఒక్కటేమిటి అన్నీ విచిత్రాలే కదా అనుకుంటున్నారా? ఇది మరింత విచిత్రమైనది. రాష్ట్ర వ్యాప్తంగా 800కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో కోర్టు ధిక్కరణ కేసులు ఉండటం ఒక సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు.

బహుశ న్యాయశాస్త్ర చరిత్రలో ఇది ఒక రకంగా రికార్డుగా కూడా నమోదు అయ్యే అవకాశం ఉంది. న్యాయశాస్త్ర విద్యార్ధులు, పరిశోధకులు ఎవరైనా ఉంటే ఏపిలో కోర్టు ధిక్కరణ కేసులపై పిహెచ్ డి చేయవచ్చు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి కాబట్టి తప్పకుండా వారికి డాక్టరేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న పై తరచి తరచి చూస్తే ఎన్నో విషయాలు బోధపడవచ్చు.

అధికారుల్లో ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ కేసులు శిరోభారంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో నిత్యం ఏదో ఒక అధికారికి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ కావడం, జరిమానాలు, శిక్షలు విధిస్తుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం చూపుతుండగా, మరికొందరు సాంకేతిక కారణాలు చెబుతూ తీర్పులు అమలు చేయడం లేదు.

ఇవే ఆ తరువాత కోర్టు ధిక్కరణ కేసులుగా మారుతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. పరిస్థితి తీవ్రమవుతుండటంతో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్‌ ఈ విషయమై దృష్టి సారించనట్లు సమాచారం. వివిధ శాఖల అధికారులు, న్యాయశాఖతోనూ ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే జిల్లా స్థాయిల్లో కూడా పెద్దగానే కేసులు ఉన్నాయి. వీటిపై న్యాయస్థానాలు విచారణ నిర్వహించి కీలక ఆదేశాలు జారీచేస్తున్నాయి. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన శాఖలపై సంబంధిత వ్యక్తులు, సంస్థలు తిరిగి ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఇద్దరు సీనియర్‌ అధికారులకు హైకోర్టు వారం రోజుల జైలు శిక్ష విధించింది. దీరతో వయసు పైబడిన వారమంటూ న్యాయ స్థానాన్ని వేడుకోవాల్సి వచ్చింది. అలాగే పదవీ విరమణ చేసిన అధికారులను కూడా కోర్టు వదలడం లేదు.

ఈ నేపథ్యంలోనే సిఎస్‌ ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిసింది. అన్ని శాఖల్లోనూ ధిక్కరణ కేసులు కనిపిస్తుండగా, ఆర్ధికశాఖలో మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు 138 ధిక్కరణ కేసులు వచ్చినట్లు తెలిసింది.

వీటిలో కొన్నింటిని న్యాయస్థానం రద్దు చేయగా, ఇంకా వందకుపైగానే ధిక్కరణ కేసులు విచారణలో ఉన్నట్లు సమాచారం. వీటిల్లో ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పింఛన్లు, పరిహారాలు చెల్లింపులు, ఇంక్రిమెంట్లు, నిర్వహణ నిధులు ఇవ్వకపోవడం వంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఆర్ధిక అంశాలతో కూడుకుని ఉండడం వల్ల ఆర్ధికశాఖ ఆయా కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది.

దీంతో చివరకు ధిక్కరణ నోటీసులు అందుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇద్దరు న్యాయ కన్సల్టెంట్లను నియమించుకున్న ఆర్ధికశాఖ, తాజాగా ఒక సీనియర్‌ న్యాయవాదికి కూడా నియమించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

కేసులపై అప్రమత్తం

రోజురోజుకూ పెరిగిపోతున్న ధిక్కరణ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులకు సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెప్పించుకున్నట్లు తెలిసింది. ధిక్కరణ కేసులు ఏ రంగానికి సంబంధించినవి, ఆ కేసులకు సంబంధించి తొలి ఆదేశాలు వచ్చిన తేదీ, వాటి పరిష్కారం స్థితిగతులు, కొన్ని కేసులకు సంబంధించిన స్టే ఆర్డర్లు, అవి ఎప్పటివరకు అమలులో ఉంటాయి, ప్రభుత్వం తరఫున వకాల్తా వేసిన తేదీ వంటి వివరాలు సేకరించారు.

ధిక్కరణ కేసులకు సంబంధించి కేసుల వారీగా సంక్షిప్త నివేదికలు కూడా సిఎస్‌ తెప్పించుకుని అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ధిక్కరణ కేసులు పెరిగిపోవడానికి పాలకులు న్యాయస్థానాలపై పలు సందర్భాలలో విషం కక్కడమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. పాలకులు న్యాయస్థానాలపై విషం కక్కుతుండటంతో అధికారుల్లో నిర్లిప్తత ఏర్పాడింది. చివరకు పాలకులు బాగనే ఉన్నారు కానీ అధికారులు ఇరుక్కుంటున్నారు.

Related posts

ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసిన ఉద్యోగులు

Satyam NEWS

ఏపిలో పెట్టుబడులకు ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ ఆసక్తి

Satyam NEWS

కరోనా విపత్తు నిర్మూలన కోసం 30 న సహస్ర గాయత్రి జపం

Satyam NEWS

Leave a Comment