ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకు వైద్యులు 160 మంది శాంపిళ్లు పరిశీలించారు. వారిలో 130 మందికి నెగిటివ్ వచ్చింది. మరో 25 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
ఇటీవల విదేశాల నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటీవ్‌గా తేలడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. సిటీలో 144 సెక్షన్ అమలులో ఉంచామని పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ కరోనా బాధితుడు నివాసం ఉండే ప్రాంతంలోని 500 ఇళ్లలో సర్వే చేశాం, కొన్ని టీమ్‌లతో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశాం. బాధితుడు దిల్లీ నుంచి వచ్చిన మార్గం రవాణా సదుపాయాలను సైతం గుర్తించి చర్యలు చేపట్టాం అని తెలిపారు.
విజయవాడలో కరోనా వచ్చిన వ్యక్తి ప్రయాణించిన కారులో గుంటూరుకు మరో ముగ్గురు ప్రయాణికులు వెళ్ళారు. విజయవాడ నుంచి గుంటూరు ప్రయాణించిన ప్రయాణికులు స్వచ్చందంగా ముందుకు రావాలని సిటీ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు కోరారు. కరోనా పాజిటీవ్ కేసు రావడంతో సిటీని హై అలర్ట్ చేశామని ఆయన తెలిపారు.