39.2 C
Hyderabad
March 29, 2024 13: 22 PM
Slider సంపాదకీయం

A Question: ఇవన్నీ కాస్ట్లీ కరోనా కేసులు గురూ

#Hospital beads

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కరోనా పాజిటీవ్ రాగానే హైదరాబాద్ వెళుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అక్కడి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్య సౌకర్యాలు లేక ఇలా హైదరాబాద్ వెళుతున్నారా?

ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. ఏపి డిప్యూటీ సిఎం అంజాద్ బాషా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు విజయసాయి రెడ్డి వరకూ హైదరాబాద్ లోనే ట్రీట్ మెంట్ కు వెళ్లారు. అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ వెళ్లి కరోనా చికిత్స చేయించుకోవడం పై విస్తృత చర్చ జరుగుతున్నది.

 ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో అంత అభివృద్ధి చెందింది ఇంత అభివృద్ధి చెందింది అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు హైదరాబాద్ ఎందుకు వెళుతున్నారనేది ప్రశ్న. ఏపిలో ఆసుపత్రులు లేవా? ఉన్నా అవి వీవీఐపిలకు పనికి రావా? కరోనా పాజిటీవ్ వచ్చిన వెంటనే హైదరాబాద్ వెళ్లిపోవడం ఏమిటి? ఏపిలో కరోనా వచ్చిన ప్రజలు అక్కడే ట్రీట్ మెంట్ చేయించుకుంటుంటే ఎమ్మెల్యేలు, ఎంపిలు హైదరాబాద్ లో చికిత్స చేయించుకోవడం అసంబద్ధంగా ఉంది.

సాధారణ ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఇదేనా

 వారి ప్రాణం మీదికి వచ్చే సరికి అపోలో ఆసుప్రతులు లాంటి అధునాతన చికిత్సలు ఉన్న ఆసుపత్రులు కావాలా? ప్రజలకు సాధారణ వైద్యం అందితే సరిపోతుందా? సాధారణ ప్రజలు బోర్డర్ దాటాలంటే సావాలక్ష ప్రశ్నలు వేసి పాస్ లు అడిగే తెలంగాణ ప్రభుత్వం ఈ వీవీఐపిలను అందులోనూ కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని తమ భూభాగంలోకి ఎలా రానిస్తున్నది? వీవీఐపిలు హైదరాబాద్ వచ్చి, తమ ఇంట్లోకి వెళ్లి అక్కడ లగేజి సర్దుకుని అధునాతన ఆసుపత్రికి వెళ్లేలోపు ఎందరిని కాంటాక్టు చేస్తున్నారు?

ఎందరికి కరోనా అంటిస్తున్నారు? ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందా? ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యేలు ఎంపిలు కరోనా పాజిటీవ్ రాగానే హైదరాబాద్ వెళ్లిపోవడం వారి ఇష్టానికి సంబంధించిన అంశం అని వదిలివేసినా వారి చికిత్సకు అయ్యే ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తున్నదా లేదా? అనే అంశాన్ని కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలకు, ఎంపిలకు మెడికల్ రీయంబర్స్ మెంట్ ఉంటుంది.

దాని ప్రకారం వారు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని ఆ బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపుతారు. ఈ విధంగా కరోనా సోకిన వారి కేసుల్లో కూడా చేస్తుంటే మాత్రం దాన్ని ఏపి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో హర్షించరు. ఎందుకంటే కార్పొరేట్ ఆసుప్రతులు ఒక్కో కరోనా పేషంట్ కు 16 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ బిల్లులు పంపుతున్నాయి.

 ఐదు లక్షల రూపాయల బిల్లు దాటితే దాన్ని ముఖ్యమంత్రి ఆమోదించాల్సి ఉన్నా ఆ పార్టీకిచెందిన ప్రజాప్రతినిధులే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే ప్రజా ప్రతినిధులు అందరికి ఆదర్శంగా ఉండాలి. తమ ఆరోగ్యం విషయానికి వచ్చే సరికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటూ సాధారణ ప్రజలకు మాత్రం సర్కారీ దవాఖాన సరిపోతుందనడం దారుణమని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

ధాన్యం సేకరణకు ఏర్పాట్ల

Murali Krishna

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

Bhavani

భారత్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని హఫీజ్ హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment