మైనర్లుకు వాహనాలిస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు విజయనగరం లో జూలై 29న మైనరు డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు, సౌండు పొల్యూషను, డేంజరస్ డ్రైవింగు, డిఫెక్టివ్ నంబరు ప్లేట్లుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, పట్టుబడిన మైనర్లు, వారి కన్నవారికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషను ఆవరణంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు, వారిని చదివించేందుకు, ఇతర అవసరాలకు తీర్చేందుకు శ్రద్ధ వహించే తల్లిదండ్రులు, మైనార్టీ తీరని పిల్లలకు ఖరీదైన మోటారు సైకిళ్ళును కొని ఇచ్చి, వారి జీవితాలను ప్రమాదాల్లోకి నెడుతున్నారన్న విషయాన్ని మరిచి పోతున్నారన్నారు. డ్రైవ్ చేసేందుకు మైనర్లును అనుమతించక పోవడానికి మైనర్లులో మానసిక పరిపక్వత, స్థిరత్వం లేకపోవడం, అత్యుత్సాహం, ఆకతాయితనం, అతివేగంగా వాహనాలను నడపడం, రహదారి భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, వాహనాలను కంట్రోల్ చేయలేకపోవడం, పరిస్థితులను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం, ప్రమాదాలను అంచనా వేయకపోవడం వంటి కారణాలుగా కనిపిస్తున్నాయన్నారు. ఈ కారణాలను పరిగణలోకి తీసుకొని మైనర్లుకు డ్రైవింగు లైసెన్సులు మంజూరు చేయడం లేదన్న విషయాన్ని వారి తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. ప్రతీ వాహనానికి రిజిస్ట్రేషను, ఇన్సూరెన్సు, వాహనాలను డ్రైవ్ చేసేందుకు డ్రైవింగు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతీ సంవత్సరం దేశంలో 2. 5 లక్షల మంది రోడ్డుప్రమాదాల్లో మరణిస్తున్నారని, 4-5 లక్షల మంది గాయపడుతున్నారన్నారు. ఇతర కారణాలతో మరణించేవారి సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలన్నారు. వాహనాలకు సకాలంలో ఇన్సూరెన్సు చేయించుకోవడం వలన ప్రమాదాలకు గురైనా బాధితులకు చెల్లించాల్సిన డబ్బులను ఇన్సూరెన్సు కంపెనీ చెల్లిస్తుందని, ఒకవేళ మన వాహనాలకు ఇన్సూరెన్సు చేయించకపోతే బాధితులకు చెల్లించాల్సిన సొమ్మును కూడా సొంతంగానే చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావున, సకాలంలో వాహనాలకు ఇన్సూరెన్సు చేయించు కోవాల్సిందిగా వాహనదారులను జిల్లా ఎస్పీ కోరారు. మైనర్లు వాహనాలను డ్రైవ్ చేసి, ఇకపై పట్టుబడితే ఆయా వాహనాలను సీజ్ చేయడంతోపాటు, వారి తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. అంతేకాకుండా, విద్యార్థులపై కేసులు నమోదైతే వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళేందుకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. స్పెషల్ డ్రైవ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం పోలీసుల అభిమతం కాదని, రహదారి భద్రతలో భాగంగానే స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి, ఎం.వి. నిబంధనలు పాటించని వాహనదారులకు ఈ-చలానాలను విధిస్తామన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. వాహనదారులు తమ వాహనాలను అనుమతి ఉన్నట్లే తమ భద్రతకు, ఇతర వాహనదారుల భద్రతకు కొన్ని బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు. ఇందులో భాగంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, ఎం.వి. నిబంధనలు,రహదారి భద్రత ప్రమాణాలను పాటించడం, హెల్మెట్ ధరించడం, ద్విచక్ర వాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించడం, నిర్ధిష్ట వేగంతోనే వాహనాలను నడపడం వంటి బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన 88 వాహనాలను ఎం. వి. నిబంధనల ప్రకారం సీజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, మైనర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీజ్ చేసిన వాహనాలను రిలీజ్ చేయాలని, వాహనదారులకు చలానాలను విధించాలని ట్రాఫిక్ డిఎస్పీ డి.విశ్వనాధన్ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ డి. విశ్వనాధ్, ట్రాఫిక్ సిఐ పి.రంగనాధ్, ట్రాఫిక్ ఎస్ఐలు లోవరాజు, శంభాన రవి, ఎ.మహేశ్వర రాజులతో పాటు మైనర్ డ్రైవింగులో పట్టుబడిన వాళ్లు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
previous post