మోదీ ఇంటిపేరుపై 2019లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. కాసేపట్లో ఆయనకు శిక్షను కూడా కోర్టు ప్రకటించనుంది. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యానించినందుకు రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే రాహుల్ సూరత్ బయల్దేరి వెళ్లారు.
రాహుల్ గాంధీ ని చూసేందుకు గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్, పార్టీ శాసనసభా పక్ష నేత అమిత్ చావ్డా, ఏఐసీసీ గుజరాత్ ఇంచార్జ్ రఘు శర్మ, ఎమ్మెల్యేలతో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సూరత్‌కు చేరుకున్నారు.
అంతకుముందు రాహుల్ గాంధీ తరపు న్యాయవాది కిరీట్ పన్వాలా మాట్లాడుతూ తీర్పు వెలువడే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా హాజరవుతారని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ పరువునష్టం కేసు వేశారు. రాహుల్ తన వ్యాఖ్యలతో మొత్తం మోడీ వర్గం గౌరవాన్ని దిగజార్చారని ఆయన ఆరోపిస్తున్నారు.