29.2 C
Hyderabad
October 13, 2024 15: 23 PM
Slider జాతీయం

“సిపిఎం- ఆర్ఎస్ఎస్ లింక్” దుమారంలో సీఎం విజయన్

#vijayan

కేరళలో వామపక్ష కూటమి ఎల్‌డిఎఫ్ కు నేతృత్వం వహిస్తున్న సిపిఎం ఆ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో బిజెపి, ఆర్ఎస్ఎస్ లపై `సైద్ధాంతిక పోరాటం’లో ముందుంటుంది. పైగా, కేరళ రాజకీయాలలో మైనారిటీ వర్గాలను దగ్గర చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నేతృత్వంలో  అటువంటి ఇమేజ్ ఎంతగానో తోడ్పడుతుంది. అందుకనే తరచూ బిజెపి, ఆర్ఎస్ఎస్ లపై విమర్శలు కురిపిస్తుంటారు.

కేవలం ముస్లింలకు దగ్గర కావడం కోసమే  సిఎఎ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఆ పార్టీ ముందుంటూ వచ్చింది. అయినా ఎన్నికలలో ఎటువంటి ప్రయోజనం పొందలేకపోవడం వేరే విషయం. అయితే గత ఏడాది మేలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలేతో అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీపీ), లా అండ్‌ ఆర్డర్‌, ఎంఆర్‌ అజిత్‌ కుమార్‌ సమావేశం కావడంపై కేరళలో చెలరేగిన వివాదం పాలక సీపీఎంను ఆత్మరక్షణలో పడవేస్తున్నది.

ఈ విషయమై కేవలం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుండే కాకుండా  ఎల్‌డిఎఫ్ భాగస్వామ్య పక్షాలైన సిపిఐ, ముస్లింలీగ్ లనుండి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కేరళ చరిత్రలో మొదటిసారిగా మొన్నటి  లోక్‌సభ ఎన్నికలో బిజెపి మొదటిసారిగా ఒక స్థానాన్ని  త్రిసూర్ నుండి గెలుపొందేందుకు సిపిఎం వ్యూహాత్మక మద్దతు అందించిందని అపనిందలు సిపిఎం ఇప్పుడు గురికావాల్సి వస్తున్నది. అక్కడి నుండి గెలుపొందిన సురేష్ గోపి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉన్నారు.

ఈ విషయమై నిప్పులు చెరిగిన తోటి వామపక్షం సిపిఐ `సైద్ధాంతిక స్పష్టత’ కోరుతూ సమావేశం జరపాలని నిలదీసింది. హోసబలేను కలిసిన ఏడీజీపీ కుమార్ సీఎం విజయన్‌కు నమ్మకస్తుడిగా పేరుండటమే కారణం. మే, 2023లో త్రిసూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిబిరంలో హోసబెలెను కలిసారని ప్రతిపక్ష నేత విడి సతీషన్ ఆరోపించారు. గత జూన్ లో మరో ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ ను కోవలంలో కలిసారని, ఆ సందర్భంగా సీఎం విజయన్ బంధువు ఒకరు, ఆయనకు సన్నిహితుడైన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఉన్నారని కూడా వెల్లడించారు.

బుధవారం జరిగిన ఎల్డిఎఫ్ సమావేశంలో మిత్రపక్షాలు సిపిఎం నుండి వివరణ కోరాయి. వెంటనే అజిత్ కుమార్ ను విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశాయి. సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాదని చెబుతూ, ఆయనపై వచ్చిన ఇతర ఆరోపణలపై డిజిపి దర్యాప్తు చేస్తున్నారని, ఈ అంశం కూడా దర్యాప్తు చేస్తారని సీఎం విజయన్ చెప్పుకొచ్చారు.  అజిత్ కుమార్ ప్రభుత్వంకు నమ్మక ద్రోహం చేశాడని, తనపై బంగారం స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న కరుడుగట్టిన నేరస్థుడిగా ముద్రవేసాడని ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యే పివి అన్వర్ ఆరోపించారు.

అజిత్ కుమార్ అక్రమ సంపదను కూడబెట్టారని, మంత్రులతో సహా రాజకీయ నాయకుల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేశారని, పి.శశితో ఉన్న సంబంధాల కారణంగా శిక్షార్హత లేకుండా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కీలక నేతతో అజిత్ కుమార్ భేటీ జరిపిన పరిణామమే లోక్ సభ ఎన్నికలకు ముందు  పోలీసులు ఐకానిక్ త్రిసూర్ పూరం ఉత్సవానికి “అంతరాయం కలిగించడానికి” దారితీసిందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇది త్రిసూర్ నుండి గోపి గెలవడానికి “దోహదపడింది” అని కూడా విమర్శిస్తున్నారు. మరోవంక, లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి కేరళ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ జవదేకర్‌తో భేటీ జరిపిన తమ పార్టీ కీలక నేత ఇపి జయరాజన్‌ను ఎల్‌డిఎఫ్ కన్వీనర్‌గా సిపిఎం తొలగించడం కూడా  సంఘ్ పరివార్‌తో “సిపిఎం లింకులు” ఉన్నాయని ఆరోపించడానికి ప్రతిపక్ష శిబిరానికి తాజా మందుగుండును అందించాయి.

ఈ ఘటనలతో `సిపిఎం లౌకికవాదం ముసుగు’ తొలిగిపోయిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొనల్సి వచ్చింది. కేరళలో బిజెపి తన లోక్‌సభ ఖాతా తెరవడానికి కుమార్-హొసబలే సమావేశం సహాయపడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి డి సతీశన్ ఆరోపించారు. “లోక్‌సభ ఎన్నికల సందర్భంగా త్రిసూర్ పూరం పండుగను పోలీసులు అడ్డుకోవడం హిందూ మనోభావాలను బిజెపికి అనుకూలంగా రెచ్చగొట్టడమే” అని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశం “లౌకిక సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది” అని కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి విమర్శించారు. ”సిపిఎం మైనార్టీలతో పాటు మెజారిటీ వర్గాలకు ద్రోహం చేసింది. పూరం పండుగను చెడగొట్టడం ద్వారా విశ్వాసులను అవమానించడమే త్రిస్సూర్ స్థానంలో బీజేపీ విజయం’’ అని ఆయన ఆరోపించారు.

సిపిఐ కూడా తన సీనియర్ ఎల్‌డిఎఫ్ మిత్రపక్షంపై దాడులను కొనసాగించింది,  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం మాట్లాడుతూ ఏడీజీపీ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను ఒకరి తర్వాత ఒకరు ఎందుకు కలిశారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఒక ప్రముఖ సంస్థ కాబట్టి ఈ సమావేశం “పెద్ద విషయం” కాదని సీపీఎం నేత, అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శ్యాంసీర్ చేసిన ప్రకటనను విశ్వం తప్పుబట్టారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ ఈ సమావేశం జరిగిందని అంగీకరించారు. అయితే, గత ఏడాది ఎప్పుడో మే లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి హోసబాలే ఎడిజిపి కుమార్‌ను కలిశారని, 2024 ఏప్రిల్‌లో జరిగిన పూరం కార్యక్రమం ఈ భేటీ కారణంగానే భగ్నం చేశారని చెప్పడంలో తార్కికత ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

ఏప్రిల్ 19న ఐకానిక్ త్రిస్సూర్ పూరం ఉత్సవంలో పోలీసుల జనాన్ని నియంత్రిచడంలో విఫలం చెందడంతో అంతరాయం కలిగించిందని ఆరోపించారు, ఇది లోక్‌సభ ఎన్నికల ముందు విజయన్ ప్రభుత్వాన్నిఆతరక్షణలో పడవేసిందని, పండుగను ఆవరించిన అనిశ్చితి మధ్య బిజెపి నేత గోపి దాని నిర్వాహకులకు భరోసా ఇవ్వడానికి జోక్యం చేసుకున్నారని సురేంద్రన్ స్పష్టం చేశారు. సహజంగానే ఆ తర్వాత ఏప్రిల్ 26న జరిగిన ఓటింగ్ పై “ప్రభావం” చూపిందని ఆయన తెలిపారు.

ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటినా ఈ వివాదం ఇంకా రగులుతూనే ఉంది.  ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఎడిజిపిపై చర్య తీసుకోవాలని ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడితో ఆయన భేటీ విజయన్ ప్రయోజనాలను కాపాడేందుకేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విజయన్ ఈ వివాదంపై మొదటిసారి స్పందిస్తూ “సీపీఐఎంకి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కేరళ అనుభవాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఏదో సీరియస్‌గా జరిగినట్లు ప్రొజెక్ట్ చేయడానికి బిడ్ ఉంది.

తలస్సేరి అల్లర్ల సమయంలో (1971), సంఘ్ పరివార్ మైనారిటీ వర్గాల ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, సీపీఎం రక్షణగా నిలిచింది. మేము ప్రాణాలు కోల్పోయాము” అని గుర్తు చేశారు. పైగా, “ఆ తర్వాత కాంగ్రెస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలకు రక్షణగా నిలిచింది. కమ్యూనిస్టుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ తన సొంత జిల్లా కన్నూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ శాఖలకు రక్షణ కల్పించినట్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకరన్ బహిరంగంగా ప్రకటించారు” అంటూ కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగారు.

సిపిఎం ఎల్లప్పుడూ సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా తన “రాజీలేని వైఖరిని” ప్రదర్శిస్తుందని స్పష్టం చేస్తూ 2009లో, అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ హయాంలో “గుజరాత్ అభివృద్ధి నమూనా”ను ప్రశంసించినందుకు పార్టీ అప్పటి ఎంపీ ఎపి అబ్దుల్లాకుట్టిని బహిష్కరించిందని ఆయన గుర్తు చేశారు.

Related posts

సమాచార శాఖను దోచుకున్న అధికారులకు ఇక కటకటాలే

Satyam NEWS

భార్యను కొట్టి చంపిన భర్త

Bhavani

సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఎల్లేని

Satyam NEWS

Leave a Comment