మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని వనపర్తి జిల్లా ఎస్ పి కె. అపూర్వరావు ఆదేశించారు. నేడు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళల విషయంలో సమస్య తీవ్రతను గుర్తించకుండా సందర్భానుసారంగా స్పందించక పోవడంతో చిన్న తప్పిదాలే పెనుసవాళ్లుగా మారుతున్నాయని ఆమె అన్నారు.
అందుకే విధి నిర్వహణలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. పోలీసు కళా జాత బృందాలతో, షీ టీమ్స్ ద్వారా తల్లిదండ్రుల్లో, ప్రజలకు, విద్యార్థులకు, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అత్యవసర సమయంలో మహిళలు, ప్రజలు వినియోగించే డయల్ 100 కాల్స్ పట్ల వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని, తక్కువ సమయంలో సంఘటన స్థలానికి చేరి సేవలు అందించాలని ఆమె అన్నారు.
షీ-టీమ్ బృందం లోని సిబ్బంది అందరూ అన్ని విద్యా సంస్థలలో, పట్టణంలోని ముఖ్యా కూడళ్లలో ప్రత్యేక నిఘాతో విధులను నిర్వర్తించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల విషయంలో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రోడ్డు డైవర్లు మద్యం సేవించడం వల్లే జరుగుతున్నాయని , జిల్లాలోని అన్ని రహదారులలో గ్రామాలలో కేటగిరిల వారిగా తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.
అవసరమైన చోట ఇంజనీరింగ్ అధికారులతో, విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకొని, ప్రమాదాలు జరగకుండా వాటి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కేసు వివరాలు ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్.లో (ఆన్ లైన్) నమోదు చేయాలని ఎస్ పి సూచించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో సులభ మార్గంలో కేసులను పరిష్కరించాలని అన్నారు.
పోలీస్టేషన్ రికార్డులను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ-పెట్టి కేసులను, బహిరంగ ప్రదేశంలో మద్యపానం, ధూమపానం వంటి కేసులను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా పోలీస్టేషనుకు వచ్చే ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించాలని, ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ప్రతి గ్రామంలో సి.సి.కెమెరాల ఏర్పాటుకు ప్రజలలో చైతన్యం పెంపొందించి వాటిని అమర్చేందుకు కృషిచేయాలని ఎస్ పి చెప్పారు.
ఈ నేర సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వనపర్తిడి ఎస్పీ కిరణ్ కుమార్, డిసీఆర్బీ సీఐ జమ్ములప్ప, వనపర్తి సీఐ సూర్యనాయక్, కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూరు సీఐ సీతయ్య, జిల్లాలోని ఎస్సైలు డిసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.