29.2 C
Hyderabad
September 10, 2024 16: 28 PM
Slider విజయనగరం

విజిబుల్ పోలీసింగ్ తోనే నేరాల నియంత్రణ

#police

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ  వకుల్ జిందల్, డీపీఓలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగును ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో విధిగా నిర్వహించాలని, తద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుడంతో పాటు, నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. వివిధ కారణాలతో న్యాయం కోసం పోలీసు స్టేషన్లును ఆశ్రయించే బాధితులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, వారు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని, చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు.

హిస్టర్ షీట్లు కలిగి, చురుకుగా ఉండే వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, వారి ప్రవర్తనను గమనిస్తుండాలన్నారు. వివిధ కేసుల్లో అరెస్టు కాబడే వ్యక్తుల నేర చరిత్రను పరిశీలించి, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. తరుచూ నేరాల్లో ఉన్నవారిని, దురుసు ప్రవర్తన కలిగిన వారిని బైండోవరు చేయాలని, అవసరమైతే వారిపై హిస్టరీ షీట్లును ప్రారంభించి, నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎం.వి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపైనా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైనా కేసులు నమోదు చేయాలన్నారు.

నేరాలను నియంత్రించేందుకు పగలు, రాత్రుల బీటులతో గస్తీని ముమ్మరం చేయాలని, రద్దీ ప్రదేశాలు, మార్కెట్ ప్రాంతాలు, బ్యాంకులు వద్ద ఉదయం సమయంలోను, కళాశాలల వద్ద సాయంత్రం సమయాల్లోను విజిబుల్ పోలీసింగు నిర్వహించాలని ఆకతాయిలను కట్టడి చేయాలన్నారు. పోలీసు స్టేషను పరిధిలో గ్రామాలను దత్తతగా స్వీకరించిన సిబ్బంది, అధికారులు తరచూ సందర్శించాలని, ఎప్పటికప్పుడు గ్రామంలోని శాంతిభద్రతల సమస్యలు, రాజకీయ వైరాలను ముందుగా గుర్తించి, ప్రజలతో శాంతి సమావేశాలు నిర్వహించాలని, గ్రామాల్లో గొడవలు జరగకుండా చూడాలని, మహిళా సంరక్షణ పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎం.ఎస్.పి.లతో సంబంధిత పోలీసు అధికారులు వారంలో ఒక రోజు సమావేశం కావాలని, వారు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాలు, గ్రామాల గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గంజాయి నియంత్రణకు ప్రాధాన్యతనివ్వాలని, గంజాయి సేవించినా, కొద్ది మొత్తంలో విక్రయించినా, రవాణకు పాల్పడినా తీవ్రంగా పరిగణించి, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు కారకులైన వ్యక్తులు, ప్రధాన సూత్రదారులను గుర్తించాలని, వారు ఎంతటి వారైనా ఉపేక్షించ వద్దని, వారిని ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చాలని, అరెస్టు చేయాలన్నారు.

గంజాయి అక్రమ రవాణ కేసుల్లో పోలీసు సిబ్బంది పాత్ర ఉన్నట్లుగా విచారణలో వెల్లడైతే వారిపై కఠిన చర్యలు తప్పవని, వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. పేకాట, కోడిపందాలు, ఇసుక అక్రమ రవాణ నియంత్రణకు స్థానిక పోలీసు అధికారులు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. దర్యాప్తులోఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, పార్టీలకు అతీతంగా వ్యవహరించి, వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం, జిల్లా ఎస్పీగారు వివిధ డిఎస్పీలు, సీఐల వద్ద దర్యాప్తులో ఉన్న గ్రేవ్, ఎస్సీ – ఎస్టీ, గంజాయి, పోక్సో, రోడ్డు ప్రమాద కేసులను సమీక్షించి, కేసుల ప్రగతిని పరిశీలించి, దర్యాప్తులను వేగవంతం చేసి, 60 రోజుల్లో కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ దిశా నిర్ధేశం చేసారు. అదే విధంగా ఓపెన్ డ్రింకింగు, డ్రంకన్ డ్రైవ్ కేసులను, దర్యాప్తులో ఉన్న మిస్సింగు కేసులు, 194 బి.ఎన్. ఎన్.ఎస్.కేసులను సమీక్షించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు జిల్లా ఎస్పీ లక్ష్యాలను నిర్దేశించారు.

రోడ్డు ప్రమాదాలు జరుగుటకు గల కారణాలను, సంబంధిత అధికారులు వాటి నియంత్రణకు తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీగారు అడిగి తెలుసుకొని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అదనంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించి, కాషనరీ బోర్డులు, స్టావర్లు, జిగ్ జాగ్ రేడియం స్టిక్కర్లును, జాతీయ రహదారులపై రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ అస్మా ఫరహీన్ , ఏఆర్ అదనపు ఎస్పీ ఎం. ఎం. సోల్మన్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డిఎస్పీ పి. శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్. చక్రవర్తి, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ట్రాఫిక్ డిఎస్సీ డి. విశ్వనాధ్, ఏఆర్ డిఎస్పీ యూనివర్స్, న్యాయ సలహాదారులు వై. పరశురాం, పలువురు సిఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎసైలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

తాగి న్యూసెన్స్ సృష్టిస్తే పోలీసులు తీట తీస్తారు

Satyam NEWS

బ్రాహ్మణులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం

Bhavani

జమ్మలమడుగు వ్యవసాయ కమిటీ చైర్మన్ గా నార్పల

Satyam NEWS

Leave a Comment