ఒక అమ్మాయిపై కన్నేశాడు. భార్య సహకరించింది. ఇద్దరూ కలిసి బ్లాక్ మెయిల్ చేసి ఆమె నుంచి 50 లక్షల రూపాయలు కొట్టేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పిఎస్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన మామిడి సంజీవ రెడ్డి, అతని భార్య మామిడి కావేరి, మేనల్లుడు విశాల్ రెడ్డి బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ లో ఉంటారు.
అమెరికాలో ఉండే ఒక అమ్మాయికి సంజీవరెడ్డి ఫేస్ బుక్ రిక్వెస్టు పంపాడు. ఆమె యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. 2018 అక్టోబర్ 31 న ఆ అమ్మాయి అమెరికా నుండి తిరిగి వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం వద్దకు వెళ్లి సంజీవరెడ్డి ఆమెను రిసీవ్ చేసుకున్నాడు.
క్షేమంగా తీసుకువెళ్లి ఆమెను ఆమె సోదరి ఇంటి వద్ద దించేసి వచ్చాడు. కోకాపేట్ లో ఆమె నివాసం ఉంటుంది. తరువాత సంజీవరెడ్డి ఆ అమ్మాయిని లంచ్ కి రావాలని కోరాడు. దాంతో ఆమె కూకట్ పల్లిలోని సితార హోటల్ కి వచ్చింది. అప్పుడు సంజీవ రెడ్డి భార్య కావేరి, మేన అల్లుడు విశాల్ రెడ్డి కూడా ఉన్నారు.
వారిద్దరిని ఆమెకు పరిచయం చేశాడు. నలుగురూ భోజనం చేద్దామనుకున్నారు కానీ ఆమె తిరస్కరించడంతో, సంజీవరెడ్డి మెకు మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆ కూల్ డ్రింక్ తాగిన ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అప్పుడు సంజీవరెడ్డి, అతని భార్య, మేన అల్లుదూ కలిసి నిజాంపేట్ లోని ఇంటికి తీసుకువెళ్లారు.
అక్కడ సంజీవరెడ్డి తన భార్య సహకారంతో ఆమెను రేప్ చేశాడు. వీడియో తీశారు. ఆ వీడియోలు చూపించి ఆమెను బెదిరించి డబ్బు వసూలు చేయడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇలా బెదిరించి ఆమె నుండి 30 తులాల బంగారం, 6000 US డాలర్ లను బలవంతంగా లాక్కున్నాడు. మొత్తంగా ఆమె దగ్గర నుండి దాదాపుగా 50 లక్షల రూపాయల వరకూ వసూలు చేశారు. విసిగి పోయిన ఆమె బాచుపల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిఘా వేశారు. భార్య మేనల్లుడితో సహా బీదర్ పారిపోయిన సంజీవరెడ్డిని పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు రిమాండ్ లో ఉన్నారు.